
పబ్జీ..ఈ గేమ్ తెలియని యువత ఉండరు..లాక్ డౌన్ కారణంగా ఈ గేమ్ కు విపరీతమైన ఆదరణ లభించింది. నిద్ర లేచినదగ్గరి నుండి నిద్ర పోయేవరకు చాలామంది ఈ పబ్జీకే అంకితమయ్యారు. తాజాగా కేంద్రం ఈ పబ్జీ గేమ్ ను బ్యాన్ చేయడం తో మనస్థాపానికి గురైన బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం గా మారింది.
వివరాల్లోకి వెళ్తే..
చెన్నైలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కిరణ్ కుమార్ రెడ్డి కళాశాలలో చదువుకుంటుండగా పబ్జీ గేమ్‌కు అలవాటుపడ్డాడు. ఇటీవల ప్రభుత్వం పబ్జీ గేమ్ రద్దు చేయడంతో మనస్తాపానికి గురైన కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెల 7న తమ ఇంటిపైన నిర్మాణంలో ఉన్న ఓ గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తమ కుమారుడు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇంటి పైన నిర్మాణంలో ఉన్న ఓ గది నుంచి దుర్వాసన వస్తుండటంతో కూలీలు తలుపులు పగలగొట్టి చూడగా కిరణ్‌కుమార్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు నరసింహారెడ్డి, హిమాజారాణి బోరున విలపించారు.









