
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు రాజస్థాన్ రాయల్స్ షాకిచ్చింది. 186 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 15 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలపై ఈ ఓటమి గట్టి దెబ్బ కొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాహుల్ సేన గేల్ అదిరే ఇన్నింగ్స్‌తో 185 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 186 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ 17.3 ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.
రాబిన్ ఉతప్ప, బెన్‌స్టోక్స్‌లు జట్టుకు శుభారంభాన్ని అందించారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించాక 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసిన స్టోక్స్ పెవిలియన్ చేరాడు. 30 పరుగులు చేసిన ఉతప్ప 111 పరుగుల వద్ద అవుట్ కాగా, సంజు శాంసన్, కెప్టెన్ స్మిత్‌లు కలిసి జట్టును విజయానికి చేరువ చేశారు. ఇద్దరూ అడపాదడపా బంతిని బౌండరీలకు బాదుతూ ఒత్తిడి లేకుండా చూసుకున్నారు. 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 48 పరుగులు చేసిన శాంసన్ అవుటయ్యాక వచ్చిన బట్లర్‌తో కలిసి స్మిత్ జట్టుకు విజయాన్ని అందించాడు. స్మిత్ 20 బంతుల్లో 31, బట్లర్ 11 బంతుల్లో 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.









