Bramhanda Movie : సినిమా విడుదలకు ముందే దర్శకుడి మృతి!!

Bramhanda director
Bramhanda Movie : తెలుగు సినీ పరిశ్రమను విషాదం కమ్ముకుంది. తెలంగాణ జానపద కళారూపమైన ఒగ్గు కథ నేపథ్యం ఆధారంగా రూపొందించిన ‘బ్రహ్మాండ’ సినిమాతో తొలిసారిగా దర్శకుడిగా పరిచయం అవుతున్న సండ్రు నగేష్ అలియాస్ రాంబాబు (47) కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన ‘బ్రహ్మాండ’ ప్రివ్యూలో పాల్గొన్న ఆయన, ప్రివ్యూ సమయంలో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై కుప్పకూలిపోయారు. వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించి జూలై 8 అర్ధరాత్రి ఆయన కన్నుమూశారు. బుధవారం (జూలై 9) ఆయన స్వగ్రామమైన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం అల్లీపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు భార్య సరిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Also Read :  Mass Surprise: 12 ఏళ్ల తర్వాత మళ్లీ గాయకుడిగా మారిన స్టార్ హీరో! ఆ సినిమా కోసమే..

రాంబాబు దాదాపు 150కు పైగా చిత్రాలు, 60కి పైగా టీవీ సీరియల్స్‌కు సహాయదర్శకుడిగా పని చేసి మంచి గుర్తింపు సంపాదించారు. ‘అంతరంగాలు’, ‘అన్వేషణ’ వంటి సీరియల్స్‌కు కో-డైరెక్టర్‌గా పనిచేశారు. ‘బ్రహ్మాండం’ చిత్రంలో ఆమని ప్రధాన పాత్ర పోషించగా, బలగం జయరాం, ఆనంద్ బాల్సాద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దాసరి మమత సమర్పణలో సురేష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 18న విడుదల కానుంది. కానీ సినిమా విడుదలకు ముందే దర్శకుడు మృతి చెందడం చిత్ర బృందంతో పాటు ప్రేక్షకులను కూడా కలచివేసింది.