
Paradha OTT : యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సోషల్ డ్రామా ‘పరదా’ ఇప్పుడు ఓటీటీలో సైలెంట్‌గా విడుదలై స్ట్రీమింగ్ అవుతోంది. ఆగస్ట్ 22న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా పెద్ద అంచనాలతో వచ్చినప్పటికీ, ఆశించిన స్థాయిలో హిట్ సాధించలేకపోయింది. ఆ కారణంగా నిర్మాతలు త్వరగా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికపై సెప్టెంబర్ 12 నుంచి అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అనుపమతో పాటు దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్, రాజేంద్ర ప్రసాద్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, హర్షవర్దన్ కీలక పాత్రల్లో నటించారు. ఆనంద మీడియా బ్యానర్ పై పీవీ శ్రీనివాసులు, శ్రీధర్ మక్కువ ఈ చిత్రాన్ని నిర్మించారు.
కథ విషయానికొస్తే ఓ కల్పిత గ్రామమైన పడతి లో నెలకొన్న ఓ పురాతన ఆచారాన్ని కథా నేపథ్యంగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. ఆ గ్రామంలో ఆడవాళ్లు తప్పనిసరిగా ‘పరదా’ కప్పుకోవాలి. దీన్ని పాటించని వారికి గ్రామ దేవత జ్వాలమ్మ ముందు ఆత్మార్పణ చేయాల్సిన కఠిన ఆచారం ఉంది. ఈ నేపథ్యంలో, సుబ్బు (అనుపమ) పరదా లేకుండా ఉన్న ఫోటో బయటపడడంతో కథ మలుపు తిరుగుతుంది. తనపై వచ్చిన అపవాదును తుడిచి వేసేందుకు సుబ్బు ధర్మశాలకు వెళ్లడం, అక్కడ ఆమెకు రత్న (సంగీత), అమిష్ట (దర్శన రాజేంద్రన్) లాంటి వారు కలవడం.. తద్వారా ఆ గ్రామపు నిజాల్ని బయటపెట్టే ప్రయత్నం చేయడం ప్రధాన కథాంశంగా నిలుస్తుంది.












