వీధి కుక్కలను చంపడంపై రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం…

Renudesai dogs
వీధి కుక్కలను చంపే చర్యలపై సినీనటి, జంతు ప్రేమికురాలు రేణు దేశాయ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కేవలం వీధి కుక్కల వల్ల జరిగిన మరణాలనే “ప్రాణనష్టం”గా పరిగణించడం ఎంతవరకు సమంజసం అని ఆమె ప్రశ్నించారు. రోడ్డు ప్రమాదాల్లో, దోమల వల్ల వచ్చే వ్యాధులతో, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల, మహిళలపై అత్యాచారాలు–హత్యలతో రోజూ ఎన్నో ప్రాణాలు పోతున్నాయని, వాటన్నింటినీ పక్కన పెట్టి కేవలం కుక్కల వల్ల చనిపోయినవారినే ప్రాణాలుగా ఎందుకు చూస్తున్నారని నిలదీశారు.

100 వీధి కుక్కల్లో ఐదు కుక్కలు మాత్రమే అగ్రెసివ్‌గా ఉంటాయని పేర్కొన్న రేణు దేశాయ్, ఆ ఐదు కుక్కల కారణంగా మిగిలిన 95 కుక్కలను చంపడం ఎంతటి అన్యాయమో అని ప్రశ్నించారు. ఈ భూమిపై ప్రతి జీవికి జీవించే హక్కు ఉందని, నిస్సహాయంగా ఉన్న కుక్కలను దారుణంగా హతమార్చడం మానవత్వానికి విరుద్ధమని అన్నారు. కాలభైరవుడిగా పూజలు అందుకునే శునకాలను చంపాలనిపించడం ఎలా సాధ్యమవుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాల వైఫల్యాల వల్లే వీధి కుక్కల సమస్య తీవ్రరూపం దాల్చిందని, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఏబీసీ (ABC) విధానం, వ్యాక్సినేషన్లు సక్రమంగా అమలు చేస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అలాంటి స్పష్టమైన పరిష్కారం ఉన్నప్పటికీ, సమస్యను జటిలం చేసి కుక్కల మరణాలకు కారణమవుతున్నారని మండిపడ్డారు.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

భారతదేశంలో వేస్ట్ మేనేజ్‌మెంట్ సరిగా లేకపోవడం వల్లే వీధి కుక్కల సంఖ్య పెరుగుతోందని, ఈ లోపాలను సరిచేయకుండా కుక్కలను చంపడం ద్వారా సమస్యను పరిష్కరిద్దామనుకోవడం సరైంది కాదని సూచించారు. తనకు 45 సంవత్సరాలు వచ్చాయని, ఇప్పటివరకు ఏ వీధి కుక్క కూడా తనపై దాడి చేయలేదని పేర్కొన్న రేణు దేశాయ్, దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పులను వక్రీకరించి అర్థం చేసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుక్కలను పూర్తిగా సంహరించే విధానాలకు శ్రీకారం చుట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాలైనా, వ్యక్తులైనా అన్యాయంగా శునకాలను హత్య చేసే కార్యక్రమాలకు తక్షణమే ముగింపు పలకాలని ఆమె డిమాండ్ చేశారు.