OYO IPO: మారబోతున్న ఓయో జాతకం.. ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్! మార్కెట్లో ‘ప్రిజమ్’ సంచలనం ..

OYO IPO

OYO IPO: హోటల్ – ట్రావెల్ టెక్ దిగ్గజం ‘ఓయో’ (Oyo) మాతృసంస్థ ప్రిజమ్ (PRISM) ఐపీఓ దిశగా ఒక భారీ అడుగు వేసింది. కంపెనీ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకు సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. డిసెంబర్ 2025 చివరి వారంలో కంపెనీ తన లిస్టింగ్ ప్రణాళికల్లో భాగంగా సెబీ వద్ద కాన్ఫిడెన్షియల్ డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయగా.. తాజాగా దానికి అనుమతి లభించింది. గత ఏడాది డిసెంబర్ 20, 2025న నిర్వహించిన ఎక్స్‌ట్రార్డినరీ జనరల్ మీటింగ్‌ (EGM)లో ప్రిజమ్ కంపెనీ షేర్‌హోల్డర్లు కొత్త ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.6,650 కోట్ల వరకు నిధులను సమీకరించేందుకు ఆమోదం తెలిపారు. ఈ ఐపీఓ ద్వారా మార్కెట్లోకి అడుగుపెడుతున్న ప్రిజమ్ (ఓయో) మార్కెట్ వాల్యుయేషన్ దాదాపు 7 నుంచి 8 బిలియన్ డాలర్ల (రూ.58,000 కోట్ల పైమాటే) మధ్య ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా.

జూలై 2026 నాటికి పబ్లిక్ డ్రాఫ్ట్ రెడీ
ఐపీఓ ప్రాసెస్ తదుపరి దశలో భాగంగా కంపెనీ అప్‌డేటెడ్ డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (UDRHP-1)ను పబ్లిక్‌గా దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇది దాఖలైన తర్వాత సాధారణ ప్రజల అభిప్రాయాలు, వ్యాఖ్యల కోసం 21 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. కంపెనీ జూలై 2026 ఆరంభం నాటికి ఈ UDRHP-1 పత్రాన్ని దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు – లిస్టింగ్‌కు సరైన సమయం కోసం ప్రిజమ్ యాజమాన్యం వేచి చూస్తోంది.

రంగంలోకి దిగ్గజ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు
ఈ మెగా ఐపీఓ బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేయడానికి దేశ, విదేశీ దిగ్గజ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులను బుక్ – రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా కంపెనీ నియమించుకుంది. ఇందులో యాక్సిస్ క్యాపిటల్, సిటీబ్యాంక్, గోల్డ్‌మన్ శాక్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్, జేఎమ్ ఫైనాన్షియల్, ఇన్‌క్రెడ్ క్యాపిటల్, ఇంటెన్సివ్ ఫిస్కల్ సర్వీసెస్ ఉన్నాయి. ఇటీవలే సెబీ మాజీ ఛైర్మన్ అజయ్ త్యాగిని కంపెనీ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా ప్రిజమ్ నియమించుకోవడం విశేషం. దీనితో పాటు గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ (Moody’s) కూడా ప్రిజమ్ కంపెనీపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తపరిచింది. ప్రిజమ్ యొక్క ‘B2 కార్పొరేట్ ఫ్యామిలీ రేటింగ్’ను ‘స్టేబుల్ ఔట్‌లుక్’తో మూడీస్ అలాగే ఉంచింది. జీ6 హాస్పిటాలిటీ కొనుగోలు ద్వారా వస్తున్న రాబడి, ప్రీమియం హోటళ్ల విస్తరణ, నిర్వహణ ఖర్చులు తగ్గడం వల్ల.. ఆర్థిక సంవత్సరం 2026 నాటికి కంపెనీ EBITDA రెండింతలు పెరిగి దాదాపు 280 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.2,496 కోట్లు) చేరుకుంటుందని మూడీస్ అంచనా వేసింది.