Actor Ramesh: ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్..

Actor Ramesh

Actor Ramesh: టాలీవుడ్‌లో ‘గబ్బర్ సింగ్’ సినిమాతో ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు రమేష్ తాజాగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఆస్పత్రి వర్గాల సమాచారం ప్రకారం.. రమేష్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనను ఐసీయూలో ఉంచి ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి నుంచి అధికారిక హెల్త్ బులెటిన్ మాత్రం ఇంకా విడుదల కాలేదు.

ఈ విషయం తెలిసిన వెంటనే ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ అపోలో ఆస్పత్రికి వెళ్లి రమేష్‌ను పరామర్శించారు. అక్కడ వైద్యులను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన రమేష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు.