
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకుని, ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఈ ఓటమి తర్వాతే అన్నామలై రాజీనామా చేశారు. కె. అన్నామలై బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం ఆ పార్టీకి ఖచ్చితంగా భారీ రాజకీయ ఎదురుదెబ్బే అవుతుంది. తమిళనాడులో ద్రావిడ పార్టీల ఆధిపత్యాన్ని ఢీకొట్టేలా దూకుడుగా రాజకీయం చేసిన ఏకైక నేత అన్నామలై. మాజీ ఐపీఎస్ అధికారి కావడంతో యువతలో, ముఖ్యంగా మార్పు కోరుకునే ఓటర్లలో ఆయనకు బలమైన ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఆయన లేకపోవడం వల్ల పార్టీ ఆ ఫేస్ వాల్యూని కోల్పోతుంది. గత నాలుగేళ్లలో ఎన్ మణ్, ఎన్ మక్కల్ పాదయాత్ర ద్వారా, డీఎంకే ఫైల్స్ పేరుతో అవినీతి ఆరోపణలు చేస్తూ, తమిళనాడు మీడియాలో, సోషల్ మీడియాలో బీజేపీని నిరంతరం చర్చల్లో ఉంచారు అన్నామలై. ఆయన వెళ్ళిపోవడంతో గ్రౌండ్ లెవెల్‌లో క్యాడర్ ఉత్సాహం తగ్గే ప్రమాదం ఉంది. అన్నామలై కొత్తగా ఒక రాజకీయ ఉద్యమం లేదా ప్రాంతీయ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే గనుక జరిగితే, తమిళనాడులో బీజేపీ వైపు ఆకర్షితులైన యువత, మధ్యతరగతి ఓటర్లు అన్నామలై వైపు వెళ్లే అవకాశం ఉంది. ఇది బీజేపీ ఓటు షేర్‌ను మరింత దెబ్బతీస్తుంది.
అన్నామలై నిర్ణయాన్ని ప్రస్తుత తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ లాంటి నేతలు పార్టీకి ఎలాంటి నష్టం లేదు అని కొట్టిపారేస్తున్నప్పటికీ, దీని వెనుక కొన్ని రాజకీయ లెక్కలు ఉన్నాయి. అన్నామలై శైలి ఎప్పుడూ ఒంటరి పోరాటానికి, సొంతంగా ఎదగడానికే ప్రాధాన్యత ఇచ్చేది. ఆయన వైఖరి వల్లే 2023లో బలమైన ప్రాంతీయ పార్టీ అయిన అన్నాడీఎంకే బీజేపీ కూటమి నుండి బయటకు వచ్చేసింది. ఇప్పుడు అన్నామలై లేకపోవడం వల్ల భవిష్యత్తులో ఆ పార్టీ తో మళ్లీ పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ అధిష్టానానికి మార్గం సుగమం కావచ్చు. అంతేకాదు.. తమిళనాడు బీజేపీలోని పాత తరం నాయకులు, సీనియర్లు చాలా కాలంగా అన్నామలై ఏకపక్ష నిర్ణయాలపై, ఆయన దూకుడుపై అసంతృప్తితో ఉన్నారు. తాజాగా తప్పుకోవడంతో పార్టీలో అంతర్గత విభేదాలు తగ్గే అవకాశం ఉంది.









