Sardar2: బర్త్‌డే సర్‌ప్రైజ్.. ‘సర్దార్ 2’ లో ఎస్‌జే సూర్య! లుక్ మామూలుగా లేదుగా..

Sardar2

Sardar 2: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’. గతంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్‌గా నిలిచిన సర్దార్ సినిమాకు సిక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు ఆసక్తిని పెంచుతుండగా.. తాజాగా అభిమానులకు మేకర్స్ అదిరిపోయే బర్త్‌డే సర్‌ప్రైజ్ అందించారు. ప్రముఖ నటుడు ఎస్‌జే సూర్య పుట్టినరోజు సందర్భంగా ‘సర్దార్ 2’ నుంచి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేశారు.

పోస్టర్‌లో ఎస్‌జే సూర్య పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశారు. ఆయన ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. కార్తీ – దర్శకుడు పి.ఎస్. మిథ్రన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ స్థాయిలో నిర్మితమవుతోంది. తొలి భాగం ఘనవిజయం సాధించడంతో సీక్వెల్‌పై అంచనాలు మరింత పెరిగాయి. యాక్షన్, స్పై థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుందని చిత్రబృందం చెబుతోంది. ఇక ‘సర్దార్ 2’ను సెప్టెంబర్ 10 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఎస్‌జే సూర్య ఫస్ట్ లుక్ రిలీజ్‌తో సోషల్ మీడియాలో సినిమా హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతుండగా, అభిమానుల నుంచి ఈ పోస్టర్‌కు మంచి స్పందన వస్తుంది. ఈ చిత్రంలో కార్తీ ద్విపాత్రాభినయం (తండ్రీకొడుకులుగా) పోషిస్తుండగా, ఎస్.జె.సూర్య, మాళవిక మోహనన్, యోగి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కార్తీ, ఎస్‌జే సూర్య కాంబినేషన్ తెరపై ఎలా ఉండబోతుందనే ఆసక్తి ఇప్పుడు మరింత పెరిగింది.