
Ramayana: నితీష్ తివారీ డైరెక్షన్‌లో రణబీర్ కపూర్, సాయి పల్లవి, కన్నడ స్టార్ యష్ ప్రధాన పాత్రల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పీరియాడిక్ ఎపిక్ ఫిల్మ్ ‘రామాయణ’ (Ramayana). భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్‌కు సంబంధించి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్’ సొంతంగానే డిస్ట్రిబ్యూట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు టాక్.
అయితే మేకర్స్ ముందుగా అంతర్జాతీయంగా పేరున్న పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకురావాలని ప్రయత్నించారు. అందులో భాగంగానే ఇటీవల జరిగిన ప్రముఖ ‘సినీమా-కాన్’ ఈవెంట్‌లో విదేశీ పంపిణీదారులను ఆకర్షించేందుకు గట్టిగానే ప్రయత్నాలు జరిగాయని చెబుతున్నారు. అక్కడ కొంతమంది టాప్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల ప్రతినిధులకు ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రత్యేక విజువల్స్ కూడా చూపించినట్లు సమాచారం. అయితే ఆయా కంపెనీల నుంచి ఆశించిన స్థాయిలో సానుకూల స్పందన రాలేదని, వారు ఈ సినిమాను గ్లోబల్‌గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు రాలేదని టాక్ నడుస్తోంది.
గతంలో ఈ సినిమాను హాలీవుడ్ దిగ్గజ సంస్థ ‘వార్నర్ బ్రదర్స్’ (Warner Bros) ఓవర్సీస్‌లో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, కేవలం పీఆర్ ద్వారా ఆ హైప్‌ను క్రియేట్ చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పెద్ద డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతోనే, ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ ‘సెల్ఫ్-డిస్ట్రిబ్యూషన్’ మార్గాన్ని ఎంచుకున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతుంది. భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరాముడి చరిత్ర ఆధారంగా, ఎంతో పవిత్రంగా భావించే ‘రామాయణ’ గాథను ఇంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నప్పుడు.. ఇలాంటి గందరగోళ వార్తలు, తప్పుడు ప్రచారాలు రావడంపై సినీ అభిమానులు, రాముడి భక్తులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీజర్/ఫస్ట్ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్‌పై రకరకాల రూమర్స్ వస్తూనే ఉన్నాయని చెబుతున్నారు. మరి ఈ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ వివాదంపై మేకర్స్ అధికారికంగా ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.









