Venkatramayya Gari Thaluka Teaser Out: హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ సినిమా టీజర్, పాటల ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. సినీ ప్రముఖుల సమక్షంలో నిర్వహించిన ఈ వేడుకలో చిత్ర యూనిట్ సందడి చేసింది. హీరోగా దినేష్ కుమార్, హీరోయిన్‌గా ప్రముఖ నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్నారు. సతీష్ ఆవాల దర్శకత్వంలో కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూలై 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకులతో పాటు సినీ పరిశ్రమ వర్గాల నుంచి విశేష స్పందన లభించింది. మానవ సంబంధాలు, తల్లిదండ్రుల విలువ, కుటుంబ బంధాలు, ఫాదర్ సెంటిమెంట్ ప్రధానాంశాలుగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తుందని చిత్రబృందం తెలిపింది. ప్రస్తుతం డబ్బు చుట్టూ తిరుగుతున్న మానవ సంబంధాలు, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలను హృద్యంగా ఆవిష్కరించిన కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమాను రూపొందించారు.
ఈటీవీ ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా టీజర్, పాటల ఆవిష్కరణ వేడుకలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ముత్యాల సుబ్బయ్య గారి చిత్రాలను గుర్తు చేసే గొప్ప కథ ఇది. చాలా కాలం తర్వాత ఇలాంటి కథ వినడంతో మా అమ్మాయి దివిజను ఈ సినిమా చేయాలని ప్రోత్సహించాను. నిర్మాత కోమలి ఎంతో కష్టపడి సినిమాను నిర్మించారు. దర్శకుడు సతీష్ ఆవాల తన భుజాలపై బాధ్యత తీసుకుని అద్భుతంగా తెరకెక్కించారు. నాన్న గొప్పతనం, తల్లిదండ్రుల విలువను ఎంతో హృద్యంగా చూపించారు. పాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తాయి. డాక్టర్ అవుతుందని భావించిన మా అమ్మాయి ఈ సినిమాతో నటిగా పరిచయమవుతోంది. అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నటుడు మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ.. ‘ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తెప్పించే సినిమా ఇది. చాలా కాలంగా చేయాలనుకున్న తరహా పాత్ర ఈ చిత్రంలో దక్కింది. మానవ సంబంధాల విలువను గుర్తు చేసే అద్భుతమైన కథ ఇది’ అని చెప్పారు. దర్శకుడు సతీష్ ఆవాల మాట్లాడుతూ.. ‘మన దేశ సంస్కృతిలో పెద్దలకు గౌరవం ఇవ్వడం గొప్ప సంప్రదాయం. కుటుంబాల్లో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఈ సినిమా చూపిస్తుంది. జర్నలిజం నుంచి వచ్చిన వ్యక్తిగా కుటుంబ బంధాల విలువ నాకు బాగా తెలుసు. సోషల్ మీడియాలో దివిజ వీడియోలు చూసి ఈ పాత్రకు ఆమె సరిపోతుందని భావించి ఈటీవీ ప్రభాకర్ గారిని సంప్రదించాను. మనసున్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది’ అని తెలిపారు.
నిర్మాతలు కోమలి మహేందర్ తొట్టె మాట్లాడుతూ.. ‘ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ చిత్రాన్ని నిర్మించాం. మధ్యతరగతి కుటుంబాల్లో జరిగే నిజ జీవిత సంఘటనలను ఈ సినిమాలో చూపించాం. సినిమా చూస్తున్నంతసేపు కంటతడి పెట్టకుండా ఎవరూ బయటకు రారు. జూలై 18న ప్రతి ఒక్కరూ థియేటర్లకు వచ్చి సినిమాను ఆదరించాలని కోరుతున్నాం’ అన్నారు. హీరో దినేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘జయమ్మ పంచాయితీ’ తర్వాత నేను చేసిన మరో మంచి సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా పాటలు ఈ సినిమాకు ప్రాణం. ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని కలిగించే చిత్రం అవుతుంది’ అని చెప్పారు. హీరోయిన్ దివిజ ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘అందరికీ నచ్చే కథ ఇది. ప్రతి ఒక్కరూ ఎంతో మనసుపెట్టి పని చేశారు. నిర్మాత కోమలి గారు ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 18న ప్రేక్షకులంతా థియేటర్లలో ఈ సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.









