
S.Janaki : భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో దశాబ్దాల పాటు అలరించిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి కన్నుమూశారు. ఈ విషయాన్ని మైసూరులోని అపోలో ఆస్పత్రి అధికారికంగా ప్రకటించింది. ఆస్పత్రి వానే రిలీజ్ చేసిన ప్రకటన ప్రకారం.. ఎస్.జానకి శనివారం (జూలై 11) సాయంత్రం 7:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. దక్షిణ భారత సినీ సంగీత రంగంలో తనదైన ముద్ర వేసిన ఎస్.జానకి వేలాది పాటలతో కోట్లాది మంది సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో ఆమె పాడిన పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. భావోద్వేగాలకు అద్దం పట్టే గాత్రం, పదాలను స్పష్టంగా పలికే తీరు, పాత్రకు తగ్గట్టు గానాన్ని మార్చుకునే ప్రత్యేక శైలి ఆమెను భారతీయ సినీ సంగీత చరిత్రలో ఒక విశిష్ట గాయనిగా నిలబెట్టాయి.
ఎస్. జానకి మరణవార్తతో సినీ, సంగీత రంగాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు, సంగీత దర్శకులు, గాయకులు, అభిమానులు ఆమెకు సామాజిక మాధ్యమాల వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. భారతీయ సంగీతానికి ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడుతున్నారు. ఎస్. జానకి మృతి భారతీయ సినీ సంగీత రంగానికి తీరని లోటు అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ఆలపించిన ఎన్నో చిరస్మరణీయ గీతాలు తరతరాల పాటు సంగీతాభిమానులను అలరిస్తూనే ఉంటాయని పేర్కొంటున్నారు.









