Vishal: నడిగర్ సంఘం కల సాకారం.. గుడ్ న్యూస్ చెప్పిన విశాల్!

Vishal (2)

Vishal: తమిళ సినీ హీరో, నడిగర్ సంఘం (SIAA) ప్రధాన కార్యదర్శి విశాల్ మరోసారి నడిగర్ సంఘం కొత్త భవనం నిర్మాణంపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నడిగర్ సంఘం కలల ప్రాజెక్ట్ త్వరలోనే పూర్తి కానుందనే సంకేతాలను ఆయన ఇచ్చారు. తాజాగా నడిగర్ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న విశాల్, ఆ సమావేశానికి సంబంధించిన ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. “నా కుటుంబాన్ని మరోసారి కలవడం చాలా ఆనందంగా ఉంది. నడిగర్ సంఘం ఐకానిక్ భవనం నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఇప్పుడు నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసే దిశగా అందరం సిద్ధంగా ఉన్నాం” అని ఆయన ఈ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కున్నామని ఈ సందర్భంగా విశాల్ గుర్తుచేశారు. న్యాయపరమైన పోరాటాలు, ఆర్థిక ఇబ్బందులు తర్వాత ఇప్పుడు విజయానికి దగ్గరయ్యామని తెలిపారు. ఈ భవనం తమిళ సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ ప్రయాణంలో తనతో పాటు పనిచేసిన ప్రతి సభ్యుడి కృషిని విశాల్ ప్రత్యేకంగా అభినందించారు. ఒక బలమైన టీమ్‌వర్క్ వల్లే ఈ కల సాకారం అవుతోందని ఆయన చెప్పారు. “ఆ గర్వకారణమైన క్షణం ఇక ఎంతో దూరంలో లేదు. దేవుడి ఆశీస్సులు అందరికీ ఉండాలి” అంటూ తన పోస్ట్‌ను ముగించారు. విశాల్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నడిగర్ సంఘం భవనం త్వరలో పూర్తికానుందనే వార్తతో సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.