
Varanasi: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా కథ, కాన్సెప్ట్ గురించి రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానుల్లో ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. రాజమౌళి మాట్లాడుతూ.. “‘వారణాసి’ కేవలం ఒక సినిమా కాదు.. అది ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే అద్భుతమైన ప్రయాణం” అని అన్నారు. పవిత్ర నగరం వారణాసి నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రయాణం అంటార్కిటికా, ఆఫ్రికా, ప్రాచీన రోమ్ వరకు విస్తరించి, చివరికి మళ్లీ వారణాసికే చేరుకుంటుందని తెలిపారు. ఇప్పటివరకు తాము ఎప్పుడూ ప్రయత్నించని స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని వెల్లడించారు.
ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించినప్పటికీ, అది సినిమా ప్రపంచంలోకి ఒక చిన్న పరిచయం మాత్రమేనని రాజమౌళి చెప్పారు. ఈ సినిమా కథను ముందుగానే బయటపెట్టకుండా, ప్రేక్షకులకు ఈ ప్రపంచం ఎలా ఉండబోతుందో తెలియజేయడానికే ప్రత్యేకంగా ‘ఎక్స్‌పీరియన్స్ వీడియో’ను విడుదల చేసినట్లు వివరించారు. ఈ వీడియో ద్వారా సినిమా విజువల్ స్కేల్, అడ్వెంచర్, భావోద్వేగాల స్థాయిని ప్రేక్షకులు అనుభూతి చెందుతారని, కానీ అసలు కథకు సంబంధించిన కీలక అంశాలను మాత్రం గోప్యంగానే ఉంచామని ఆయన పేర్కొన్నారు. జక్కన్న కామెంట్స్ తో ‘వారణాసి’పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.














