32 నెలల్లో 75 సార్లు ఢిల్లీ.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన విమర్శలు!

Ktr
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఇప్పటికే 75 సార్లు ఢిల్లీకి వెళ్లారని, సగటున ప్రతి 13 రోజులకు ఒకసారి ఢిల్లీ పర్యటన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తరచూ ఢిల్లీకి వెళ్లడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడటానికి బదులుగా కేంద్రం ముందు యాచిస్తున్నారనే భావన ప్రజల్లో కలుగుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ప్రస్తావించిన కేటీఆర్.. తెలంగాణ నాయకత్వం ఢిల్లీ ముందు తలవంచకూడదని, స్వతంత్ర రాజకీయ అస్తిత్వంతో వ్యవహరించాలని ఆయన ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ హక్కులు, ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా కేంద్రాన్ని నిలదీసే ధైర్యం నాయకత్వంలో ఉండాలని అన్నారు. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అని జయశంకర్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉదాహరణగా పేర్కొన్న కేటీఆర్.. ఢిల్లీపై రాజీ లేకుండా గళం విప్పి రాష్ట్ర హక్కుల కోసం గర్జించిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా అదే విధంగా తెలంగాణ ప్రయోజనాల కోసం ధైర్యంగా మాట్లాడాలని సూచించారు. కేంద్రం ముందు తలవంచే రాజకీయాల కంటే రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కాపాడే వైఖరిని అవలంబించాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.