
Anupama Parameswaran: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ చేదు అనుభవాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను గతంలో ఓ టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, ఆ సమయంలో శారీరకంగా, మానసికంగా ఎంతో వేదనను అనుభవించానని ఆమె పేర్కొన్నారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. తమ సంబంధంలో ప్రేమ, బాధ ఒకదాని తర్వాత ఒకటి కొనసాగుతూ ఉండేదని అనుపమ చెప్పారు. ఒకరోజు ప్రేమగా వ్యవహరించడం, మరుసటి రోజు బాధపెట్టడం, ఆ తర్వాత చిన్నపిల్లాడిలా ఏడుస్తూ మరో అవకాశం ఇవ్వాలని కోరడం.. ఇలా ఒకే సైకిల్ పదేపదే కొనసాగిందని ఆమె వివరించారు.
ఈ రిలేషన్ షిప్ కారణంగా దాదాపు రెండేళ్ల పాటు శారీరక, మానసికంగా ఎన్నో బాధలను ఎదుర్కొన్నానని ఆమె పేర్కొన్నారు. అయితే వెంటనే స్పందించకుండా, తనకు తాను సమయం ఇచ్చుకుని పూర్తిగా కోలుకున్న తర్వాతే ఈ విషయంపై మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు చెప్పినట్లు సమాచారం. ఇక ‘డ్రాగన్’ సినిమా ప్రమోషన్స్‌కు తనను వెళ్లనివ్వలేదని కూడా ఆమె వ్యాఖ్యానించారు. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వయసులో చిన్నవాడని, అయితే అతడి కుటుంబం మాత్రం నిశ్చితార్థానికి సంబంధించిన ఏర్పాట్ల దిశగా వెళ్లిందని ఆమె చెప్పారు. అతడి బాడీ లాంగ్వేజ్ ‘అపరిచితుడు’ సినిమాలో విక్రమ్ పాత్రను గుర్తు చేసేదని కూడా ఆమె వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే విషయాన్ని అనుపమ స్పష్టంగా వెల్లడించలేదు. తన జీవితంలో జరిగిన అనుభవాల నుంచి ఎంతో నేర్చుకున్నానని, తనను తాను అర్థం చేసుకుని కోలుకోవడానికి సమయం పట్టిందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.














