
Yash: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా జరిగిన సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమంలో యశ్.. కియారాతో కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. ‘టాక్సిక్’ షూటింగ్ సమయంలో కియారా గర్భవతిగా ఉన్నారని తెలిసిన తర్వాత ఆమె ఆరోగ్యం, భద్రత విషయంలో తాను, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఎంతో జాగ్రత్త తీసుకున్నామని యశ్ తెలిపారు. సెట్లో కియారాను కాపాడేందుకు తాను బౌన్సర్, బాడీగార్డ్‌లా వ్యవహరించానని సరదాగా చెప్పారు. కియారా చాలా ప్రొఫెషనల్ నటి అని ప్రశంసించిన యశ్.. ‘టాక్సిక్’లో ఆమె పోషించాల్సిన పాత్ర శారీరకంగా ఎంతో శ్రమతో కూడుకున్నదని తెలిపారు. అందుకే ముందు ఆమెను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నప్పుడు కొంత ఆందోళనకు గురయ్యానని చెప్పారు.
సినిమా గురించి మొదటిసారి మాట్లాడినప్పుడు కియారాతో తాను ‘రెయిన్ సీక్వెన్స్‌లో ఎప్పుడైనా నటించారా?’ అని అడిగానని, దానికి ఆమె ‘లేదు.. కానీ అది సులభంగానే ఉంటుంది’ అని చెప్పినట్లు యశ్ గుర్తుచేసుకున్నారు. అయితే షూటింగ్ సమయంలో కియారా గర్భవతి అని తెలిసిన తర్వాత ఆమె విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించినట్లు యశ్ వెల్లడించారు. ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటికీ తన పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు 100 శాతం అంకితభావంతో షూటింగ్‌కు హాజరయ్యారని ప్రశంసించారు. కియారా కంటే తామే ఎక్కువగా ఆందోళన చెందామని, సెట్లో ఆమె భద్రత కోసం తాను, గీతూ బౌన్సర్లు, బాడీగార్డుల్లా ఉండేవాళ్లమని చెప్పారు. కియారా చూపించిన ప్రొఫెషనలిజం, అంకితభావం తనను ఎంతో ఆకట్టుకున్నాయని యశ్ అన్నారు. ఈ సినిమాకు ఆమె అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ‘టాక్సిక్’ తనకు ఎంతో ప్రత్యేకమైన చిత్రమని పేర్కొన్నారు. ఇక యశ్, కియారా అద్వానీతో పాటు నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ‘టాక్సిక్’ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.













