Anirudh: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌కు రానందుకు సారీ.. అసలు కారణం బయటపెట్టిన అనిరుధ్!

Anirudh Ravichander

Anirudh: న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో అత్యంత ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయారు. దీనిపై ఆయన ఓ ప్రత్యేక వీడియో సందేశాన్ని పంపుతూ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం చిత్ర చివరి దశ పనుల్లో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో కలిసి నిమగ్నమై ఉన్నట్లు వెల్లడించారు.

ఈవెంట్‌కు రాకపోవడానికి గల కారణాన్ని అనిరుధ్ వివరిస్తూ.. “అందరికీ నమస్కారం. ఈరోజు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు రాలేకపోయినందుకు ముందుగా క్షమించండి. సినిమాకు సంబంధించి చివరి క్షణాల్లో చేయాల్సిన ఫైనల్ ట్వీక్స్, ప్యాచ్ వర్క్స్ పనుల్లో నేనూ, శ్రీకాంత్ ఓదెల కలిసి బిజీగా ఉన్నాం. సినిమా మా మనసుకు ఎంతో దగ్గరైన ప్రాజెక్ట్. శ్రీకాంత్ రూపంలో నాకు ఓ మంచి తమ్ముడు దొరికాడు. ఇంత చిన్న వయసులోనే అతని ఆలోచనా విధానం, నా ఆలోచనలు ఒకేలా ఉండటం నన్ను ఆశ్చర్యపరిచింది. ఇద్దరి మధ్య వేరే లెవల్ సింక్ కుదిరింది” అని అన్నారు.

నానితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అనిరుధ్ ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచారు. “జెర్సీ, గ్యాంగ్ లీడర్ తర్వాత మా కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘ది ప్యారడైజ్’. తెలుగు ప్రేక్షకులు, నా అభిమానులు నాని-నా కాంబోను ఎంతగా ప్రేమిస్తారో నాకు తెలుసు. ఆయన నాకు సోదరుడి లాంటివాడు. శ్రీకాంత్ ప్రతిభకు తోడు నాని స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. సెప్టెంబర్ 24 నుంచి థియేటర్లలో ‘జడల్ జమానా’ మొదలవుతుంది” అని ధీమా వ్యక్తం చేశారు. హీరోయిన్ కాయదు లోహర్ లుక్స్, పెర్ఫార్మెన్స్ చాలా ఫ్రెష్‌గా ఉండబోతున్నాయని అనిరుధ్ ప్రశంసించారు. బాలీవుడ్ నుంచి వచ్చిన నటుడు రాఘవ్ జుయల్ అదిరిపోయే పాత్ర చేశాడని కొనియాడారు. సీనియర్ నటుడు మోహన్ బాబు గురించి మాట్లాడుతూ.. “నేను చిన్నప్పటి నుంచి మోహన్ బాబు అంకిల్‌ను చూస్తూ పెరిగాను. ఆయన నటించిన చిత్రానికి సంగీతం అందించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను” అని తెలిపారు.

సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన టీజర్లు, విజువల్స్ అద్భుతంగా రావడానికి సినిమాటోగ్రాఫర్ సాయి ప్రతిభే కారణమని, ఆయన పనిచేసిన చిత్రాలు కచ్చితంగా హిట్ అవుతాయనే సెంటిమెంట్ ఉందని అనిరుధ్ గుర్తుచేశారు. ఇంతటి భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్యాషన్‌తో నిర్మించిన సుధాకర్ చెరుకూరికి మంచి బ్లాక్‌బస్టర్ దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ, పాటలను గ్లోబల్ హిట్ చేసిన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపారు.