
Sudhakar Cherukuri: న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘ది ప్యారడైజ్’. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ అభిమానుల కేరింతల మధ్య కోలాహలంగా సాగింది. ఈ వేదికపై నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడిన మాటలు, వేసిన చిన్న స్టెప్పులు ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సినిమా రిలీజ్ వాయిదాలపై ప్రేక్షకులకు ఆయన క్షమాపణలు చెబుతూనే, ఫస్ట్‌హాఫ్ ఔట్‌పుట్‌పై కుండబద్దలు కొట్టిన తీరు ట్రేడ్ వర్గాల్లో సంచలనంగా మారింది.
వేదికపై నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ సినీ ప్రేమికులకు ఓపెన్‌గా సారీ చెప్పారు. “ఇన్ని రోజులు మిమ్మల్ని వెయిట్ చేయించాం. రిలీజ్ డేట్లు వరుసగా పోస్ట్‌పోన్ చేసి విసిగించినందుకు అందరికీ క్షమాపణలు చెబుతున్నాను. కానీ ఆ ఆలస్యం వెనుక ఉన్న కష్టం సెప్టెంబర్ 24న థియేటర్లలో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడే ఈవెంట్‌కు వచ్చేముందు సినిమా ఫస్ట్ హాఫ్ చూసి వచ్చాను. ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో జీవించేశారు. రేపు థియేటర్లలో బొమ్మ పడితే బ్లాక్‌బస్టర్ అవ్వడం ఖాయం. మా కష్టాన్ని చూసి మీరే అప్రిషియేట్ చేస్తారు” అని పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
మైక్ అందుకున్న ప్రారంభంలోనే సుధాకర్ చెరుకూరి తనకు టెన్షన్ ఎక్కువని ఒప్పుకున్నారు. నటీనటులు సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్, కాయదు లోహర్ పేర్లు ప్రస్తావిస్తూ టెన్షన్‌లో మిగతా వాళ్ల పేర్లు గుర్తురావడం లేదని సరదాగా అన్నారు. ఆ సమయంలో యాంకర్ జోక్యం చేసుకుని, టెన్షన్ పోవడానికి బాడీ ఫ్రీ చేసుకోవాలంటూ పాట ప్లే చేయించగా.. నిర్మాత స్టేజ్‌పైనే లైట్‌గా స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ హుషారైన మూమెంట్ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది.
పెద్దలు “మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్” అంటారని గుర్తుచేస్తూ.. ‘ది ప్యారడైజ్’ ప్రయాణం కూడా తమ ముగ్గురి మధ్య ఒక వివాహ బంధం లాంటిదని సుధాకర్ పేర్కొన్నారు. నాని, శ్రీకాంత్ ఓదెల, తనను విధి అలా కలిపిందని, ప్రతి ఒక్కరం ప్రాణం పెట్టి పనిచేశామని చెప్పారు. సినిమా కోసం రెండేళ్లుగా రాత్రింబవళ్లు కష్టపడిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, డీవోపీ సాయి, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ సహా మిగతా సాంకేతిక నిపుణులందరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వరుస వాయిదాలతో నిరాశ చెందిన సినీ ప్రియులకు నిర్మాత ఇచ్చిన ఈ బ్లాక్‌బస్టర్ స్టేట్‌మెంట్ భారీ ఊపునిచ్చింది. సెప్టెంబర్ 24న బాక్సాఫీస్ వద్ద ప్యారడైజ్ విధ్వంసం ఏ రేంజ్‌లో ఉండబోతోందో చూడాలి.













