
Irumudi: మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’పై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 21న ఈ చిత్రం థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వార్తపై తాజాగా క్లారిటీ వచ్చింది. ‘ఇరుముడి’లోని ‘మల్లెపూల పల్లకి’ పాటలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించనున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అంతేకాదు.. అయ్యప్ప దీక్షలో ఉన్న చరణ్ ఈ పాటలో రవితేజతో కలిసి స్టెప్పులు వేయనున్నారనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో మెగా, మాస్ అభిమానుల్లో ఈ రూమర్‌పై ఆసక్తి పెరిగింది.
అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తాజాగా రామ్ చరణ్ టీమ్ స్పష్టం చేసింది. ‘ఇరుముడి’లో చరణ్ ఎలాంటి క్యామియో చేయడం లేదని తేల్చిచెప్పినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇలాంటి నిరాధారమైన వార్తలను నమ్మవద్దని, తప్పుడు ప్రచారానికి దూరంగా ఉండాలని చరణ్ టీమ్ కోరినట్లు సమాచారం. ఈ రూమర్స్ రావడానికి ప్రధాన కారణం ‘మల్లెపూల పల్లకి’ పాటపై మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలేనని తెలుస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ పాటలో ఓ ప్రత్యేకమైన సర్ప్రైజ్ ఉంటుందని ఆయన చెప్పడంతో.. ఆ సర్ప్రైజ్ రామ్ చరణ్ క్యామియోనేనంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక ‘ఇరుముడి’ కథ విషయానికి వస్తే.. అయ్యప్ప దీక్ష తీసుకున్న 41 రోజుల సమయంలో ఓ వ్యక్తి జీవితంలో చోటుచేసుకునే పరిణామాల చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. రవితేజకు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా.. తండ్రి–కూతురు బంధం, కుటుంబ భావోద్వేగాలు, భక్తి, యాక్షన్, థ్రిల్ అంశాలతో శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రామ్ చరణ్ క్యామియో లేదనే క్లారిటీ వచ్చినప్పటికీ.. ‘మల్లెపూల పల్లకి’ పాటలో అసలు సర్ప్రైజ్ ఏంటనే ఆసక్తి మాత్రం కొనసాగుతోంది. ఆ సర్ప్రైజ్ను థియేటర్లలోనే చూడాలా? లేక మేకర్స్ ముందే వెల్లడిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.











