
Shiva Nirvana: మాస్ మహారాజా రవితేజ హీరోగా, డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన ‘మల్లెపూల పల్లకి’ పాట సోషల్ మీడియాలో మంచి స్పందనను సొంతం చేసుకుంది. అయితే పాటలో గాయకుడి వాయిస్ బేస్ సరిపోలేదంటూ కొందరు నెటిజన్లు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు శివ నిర్వాణ ఈ విమర్శలపై స్పందించి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మల్లెపూల పల్లకి’ ఒరిజినల్ పాట పాడిన గాయకుడు డప్పు శ్రీను తన గాత్రంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఆ పాట విడుదలై 15 ఏళ్లకు పైగా కావడంతో సహజంగానే వయసు కారణంగా ఆయన వాయిస్‌లో మార్పులు వచ్చాయని శివ నిర్వాణ తెలిపారు. ప్రస్తుత పాటకు ఆయన వాయిస్ బేస్ పూర్తిగా సరిపోదనే విషయం తమకు ముందే తెలుసని వెల్లడించారు.
అయినప్పటికీ ఒరిజినల్ పాటకు ప్రాణం పోసిన గాయకుడితోనే ఈ పాటను మరోసారి పాడించాలని నిర్ణయించుకున్నామని దర్శకుడు వెల్లడించారు. డప్పు శ్రీనుకు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. పాట విషయంలో వస్తున్న విమర్శలను తాము అర్థం చేసుకుంటున్నామని, అయితే తమ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాన్ని కూడా ప్రేక్షకులు గమనించాలని ఆయన కోరారు. ఇక ‘మల్లెపూల పల్లకి’ పాటకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించగా.. చౌడం శ్రీనివాసరావు సాహిత్యం అందించారు. విడుదలైన వెంటనే ఈ పాట సంగీత ప్రియులను ఆకట్టుకోవడంతో పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’పై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది. మాస్ ఇమేజ్ ఉన్న రవితేజను శివ నిర్వాణ తనదైన స్టైల్లో ఎలా చూపించబోతున్నారనే విషయంపై అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ చిత్రంలో రవితేజకు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా.. బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో టీ-సిరీస్ ఫిల్మ్స్, ఏకేడీ స్టూడియోస్, యూవీ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా ఉన్నాయి. ఈ సినిమాను ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది.














