
NBK111 DADA: నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. బాలయ్య హీరోగా మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీకి టైటిల్ ఖరారైంది. బాలకృష్ణ కెరీర్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న NBK111 చిత్రానికి ‘దాదా’ (DADA) అనే పవర్ఫుల్ టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘ది కింగ్ ఆఫ్ ఖోస్’ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన టైటిల్ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా గ్లింప్స్‌లో బాలయ్యను మునుపెన్నడూ చూడని విధంగా మాస్ అవతార్‌లో చూపించారు. పోలీస్ స్టేషన్ నడిబొడ్డున టేబుల్‌పై కూర్చుని పోలీసులకే రైఫిల్ గురిపెడుతున్న బాలకృష్ణ విజువల్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ‘‘నాకు గురిపెట్టడానికి ఒంట్లో పొగరు, వేలికి ట్రిగ్గర్ ఉంటే సరిపోదు.. బుల్లెట్లకు బలుపు ఉండాలి, గన్స్కు గట్స్ ఉండాలి’’ అంటూ బాలయ్య చెప్పే పవర్ఫుల్ డైలాగ్ గ్లింప్స్‌కు హైలైట్‌గా నిలిచింది. ‘వీరసింహారెడ్డి’ తర్వాత గోపీచంద్ మలినేని, బాలయ్య కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య పాత్రను అత్యంత పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసినట్లు సమాచారం. సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, మంచు మనోజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా మనోజ్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి డిసెంబర్ 24, 2026న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. టైటిల్ గ్లింప్స్‌లో బాలయ్య మాస్ లుక్, పవర్ఫుల్ డైలాగ్, గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. దీంతో డిసెంబర్లో బాలయ్య ‘దాదా’ ఎలాంటి మాస్ జాతర చూపించబోతున్నాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













