
Pithapuramlo Ala Modalaindi: ప్రముఖ డైరెక్టర్, ‘ప్రేయసి రావే’ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘పిఠాపురంలో… అలా మొదలైంది’. డా.రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా సంయుక్త నిర్మాణంలో దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మించారు.
ప్రేమ, హాస్యం, సెంటిమెంట్‌తో పాటు తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని ప్రధానంగా చూపిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు డైరెక్టర్ మహేష్ చంద్ర తెలిపారు. యువతకు మంచి సందేశాన్ని అందించేలా సినిమాను రూపొందించినట్లు చెప్పారు. మన చుట్టూ కనిపించే సహజమైన పాత్రలు, సంఘటనలతో సినిమా ఎంతో న్యాచురల్‌గా ఉంటుందని, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని వెల్లడించారు. ఈ చిత్రానికి హాస్యబ్రహ్మ డా.బ్రహ్మానందం వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ప్రముఖ శిల్పి రాజ్‌కుమార్ వడయార్ కీలక పాత్రలో నటించినట్లు చెప్పారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో పాటు రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు. ‘ఇరుముడి’, ‘విశ్వనాథం అండ్ సన్స్’, ‘మా ఇంటి బంగారం’ తరహాలో తమ చిత్రం కూడా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాగా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు.
ఈ చిత్రంలో డా.రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ, దాసరి పద్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా, జూనియర్ పవన్ కళ్యాణ్, జేడీవీ ప్రసాద్, కే.ఏ. పాల్ రాము, జబర్దస్త్ శేషు తదితరులు నటించినట్లు చెప్పారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో సెప్టెంబర్ 18న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.














