
Adivi Sesh: తమిళ స్టార్ హీరో కార్తీ, దర్శకుడు పి.ఎస్. మిత్రన్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘సర్దార్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కార్తీ, ఎస్.జే.సూర్య, మాళవిక మోహనన్, ఆశికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరో అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్తీ తనకు చాలా ఇష్టమైన హీరో అని చెప్పారు. ప్రేక్షకుడిగా కార్తీ నటించిన మూడు, నాలుగు సినిమాలు తన ఆల్‌టైమ్ ఫేవరెట్లలో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ‘ఖైదీ’, ‘మేయళగన్’, ‘ఆవారా’ చిత్రాల పేర్లను ఆయన ప్రస్తావించారు. ఇండియాకు వచ్చిన సమయంలో ‘ఆవారా’ సినిమాకు టికెట్లు దొరకకపోయినా, ఆ చిత్రాన్ని ఎంతగానో ఇష్టపడ్డానని చెప్పారు.
‘సర్దార్’ ఫర్ట్ పార్ట్ తనను ఎంతగానో ఆకట్టుకుందని అడివి శేష్ చెప్పారు. ‘‘చాలా ఫన్, స్పై మసాలా ఎంటర్టైనర్గా ఉండటంతో పాటు మంచి మెసేజ్ ఇచ్చిన సినిమా సర్దార్. అందుకే ‘సర్దార్ 2’ ఈవెంట్‌కు రావడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూశాను. ఈ సినిమా కుమ్మేస్తుందని అనుకుంటున్నాను’’ అని అన్నారు. సెప్టెంబర్ 10న సినిమాను తప్పకుండా చూస్తానని, కార్తీతో పాటు మొత్తం చిత్రబృందానికి అడివి శేష్ అభినందనలు తెలిపారు. ‘గూఢచారి 2’ కోసం తొలుత మాళవిక మోహనన్‌ను సంప్రదించామని, అయితే అప్పటికే ఆమె ‘సర్దార్ 2’ చేస్తున్నట్లు చెప్పారని వెల్లడించారు. భవిష్యత్తులో మాళవిక, ఆశికా రంగనాథ్‌లతో కలిసి పనిచేయాలని ఉందని ఆకాంక్షించారు. డైరెక్టర్ పి.ఎస్.మిత్రన్‌తో పాటు నిర్మాతలు లక్ష్మణ్, వెంకటేష్, చిత్రబృందంలోని ఇతర సభ్యులకు కూడా అడివి శేష్ బెస్ట్ విషెస్ చెప్పారు. సెప్టెంబర్ 10న ప్రేక్షకులంతా ‘సర్దార్ 2’కు సపోర్ట్ చేయాలని కోరారు.
ఇక కార్తీ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ అడివి శేష్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ‘‘కార్తీ గారిని చూస్తే మనకు ఇలాంటి ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది, ఇలాంటి ఫ్యామిలీ మెంబర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఆయన చాలా స్వీట్ హార్ట్’’ అని అన్నారు. ఆర్ఎఫ్సీలో ‘మేజర్’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. అదే సమయంలో కార్తీ మరో షూటింగ్లో ఉన్నారని, వేలాది మంది మధ్య షూటింగ్ జరుగుతున్నప్పటికీ తనను పలకరించేందుకు కార్తీ స్వయంగా తన దగ్గరకు వచ్చారని చెప్పారు. ‘‘అంత పెద్ద స్టార్ అయినప్పటికీ షూటింగ్‌ను వదిలేసి నాకు హలో చెప్పడానికి వచ్చారు. ఆయనలోని ఆ సింప్లిసిటీ నాకు చాలా నచ్చింది. మీరు ఎప్పుడు పిలిచినా నేను మీకు అండగా ఉంటాను. లవ్ యూ సో మచ్’’ అంటూ కార్తీపై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. కార్తీ ఒక సెన్సేషనల్ హీరో మాత్రమే కాకుండా ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని అడివి శేష్ ప్రశంసించారు.














