
Vijay Deverakonda: హైదరాబాద్‌లో జరిగిన ‘ఎపిక్’ ఫస్ట్ సెమిస్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ ఆకట్టుకున్నాయి. ‘‘సినిమా టైటిల్స్ మారొచ్చు.. కానీ మీరు ఎప్పటికీ నా రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్’’ అంటూ అభిమానులతో తనకున్న అనుబంధాన్ని మరోసారి చాటుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం అద్భుతమైన దశ కొనసాగుతోందని విజయ్ దేవరకొండ అన్నారు. వరుసగా మంచి సినిమాలు వస్తున్నాయని, ప్రేక్షకులు వాటిని ఆదరిస్తున్నారని చెప్పారు. ఈ ఏడాదిని ‘కమ్‌బ్యాక్స్ ఇయర్’గా పిలుస్తున్నారని, రాబోయే రోజుల్లో మరిన్ని ఆసక్తికరమైన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయని పేర్కొన్నారు.
తనకు రాబోయే మూడు నెలలు ఎంతో బిజీగా ఉండబోతున్నాయని విజయ్ తెలిపారు. ఆనంద్ దేవరకొండ నటించిన సినిమా సెప్టెంబర్ 11న, నాని ‘ది ప్యారడైజ్’, రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న ‘రణబలి’, రష్మిక మందన్న నటించిన చిత్రం, తరుణ్ భాస్కర్ సినిమా, డిసెంబర్‌లో ‘ఫౌజీ’, బాలయ్య ‘దాదా’ వంటి సినిమాలపై తనకు మంచి అంచనాలు ఉన్నాయని చెప్పారు. ‘‘ఈ సినిమాల్లో దాదాపు నాలుగు చిత్రాల కంటెంట్, గ్లింప్స్ చూశాను. 100 శాతం స్ట్రైక్ రేట్‌తో వరుస విజయాలు వస్తాయని బలంగా నమ్ముతున్నా. దీనిని ‘ఆపరేషన్ TFI’ అని పిలుద్దాం’’ అంటూ విజయ్ దేవరకొండ ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. అయితే సినిమాలు కేవలం బ్లాక్‌బస్టర్లు కావడం మాత్రమే కాకుండా.. ప్రేక్షకులకు మంచి అనుభూతిని, గుర్తుండిపోయే జ్ఞాపకాలను అందించాలని ఆకాంక్షించారు.
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత ఆసక్తికరమైన దశ కొనసాగుతోందని విజయ్ అభిప్రాయపడ్డారు. దర్శకుల స్క్రిప్ట్స్, వారి విజన్, సినిమాల స్కేల్, నిర్మాతల సపోర్ట్, నటీనటుల కమిట్మెంట్ భారీగా పెరిగాయని చెప్పారు. ఇదే సమయంలో సినిమాల నిర్మాణంలో ఆలస్యం, పోస్టుపోన్లు జరగడానికి కూడా ఈ భారీ స్కేల్ ఒక కారణమని వివరించారు. ఇండస్ట్రీలో మరింత మంది ఫిల్మ్ స్కూల్ నుంచి శిక్షణ పొందిన ప్రతిభావంతులు వస్తే సినిమాల నిర్మాణంలో మరింత ఎఫిషియన్సీ పెరుగుతుందని విజయ్ అభిప్రాయపడ్డారు.
తమ్ముడు ఆనంద్ దేవరకొండ గురించి విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా మాట్లాడారు. చిన్నప్పటి నుంచి ఆనంద్ తన వెంట తిరిగేవాడని, చదువుకునే రోజుల్లో కూడా తనను విడిచి ఉండేవాడు కాదని గుర్తుచేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆనంద్ తనకంటూ ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పరుచుకున్నాడని, తన నిర్ణయాలతో సినిమాలు చేస్తున్నాడని ప్రశంసించారు. ఆనంద్ తన ప్రయాణం, తన సినిమాలు, తన చుట్టూ ఉన్న టీమ్‌తో సొంతంగా ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉందని విజయ్ తెలిపారు. ‘ఎపిక్’లో నటించిన వైష్ణవి చైతన్యను కూడా విజయ్ ప్రశంసించారు. ఆమె అద్భుతమైన నటి అని, తన కెరీర్‌లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిందని అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆమెకు తన సపోర్ట్ ఉంటుందని అన్నారు.
‘90స్’ వెబ్ సిరీస్ తనను ఎంతగానో ఆకట్టుకుందని విజయ్ దేవరకొండ తెలిపారు. ముఖ్యంగా ఆదిత్య హాసన్ పనితీరును ప్రశంసించారు. తరుణ్ భాస్కర్ షార్ట్ ఫిల్మ్స్ రోజుల్లోనే తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడని, ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని గుర్తుచేసుకున్నారు. ‘90స్’లో మిడిల్ క్లాస్ కుటుంబాల జీవితాన్ని ఎంతో సహజంగా చూపించారని, 80లు, 90ల ప్రేక్షకులు ఆ కథతో బాగా కనెక్ట్ అయ్యారని అన్నారు. చివరగా ‘ఎపిక్’ చిత్రబృందానికి సెప్టెంబర్ 11న బిగ్ బ్లాక్‌బస్టర్ రావాలని విజయ్ దేవరకొండ ఆకాంక్షించారు. వరుసగా వస్తున్న తెలుగు సినిమాలతో ఈ ఏడాది చివరి వరకు ప్రేక్షకులకు మంచి వినోదం లభించబోతోందని ధీమా వ్యక్తం చేశారు.













