Jr NTR: ఎన్టీఆర్ రీ-ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్.. ‘డ్రాగన్’ రిలీజ్ డేట్ మారేదే లేదంటున్న ప్రశాంత్ నీల్!

Jr NTR

Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ మూవీ ‘డ్రాగన్’ షూటింగ్‌పై సినీ ప్రియులకు ఊరటనిచ్చే కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. కొద్దిరోజుల క్రితం సెట్స్‌లో ఎన్టీఆర్ భుజానికి గాయం కావడం, వైద్యుల సూచన మేరకు ఆయన ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి రావడంతో షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్ పడింది. తాజాగా తారక్ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో, ‘డ్రాగన్’ సెట్స్‌లోకి తిరిగి అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారైంది.

అక్టోబర్ మొదటి వారం నుంచి ఎన్టీఆర్ తిరిగి షూటింగ్‌లో పాల్గొననున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే, హీరో అందుబాటులో లేని ఈ సమయాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏమాత్రం వృథా చేయలేదు. తారక్ లేకుండానే ఇతర నటీనటులతో తెరకెక్కించాల్సిన కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు ఈ నెలలోనే ప్రత్యేక షెడ్యూళ్లను సిద్ధం చేసి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. షూటింగ్‌కు స్వల్ప విరామం వచ్చినప్పటికీ, సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని మేకర్స్ గట్టి పట్టుదలతో ఉన్నారు.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే 2027 జూన్ నాటికి సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావాలని డెడ్‌లైన్ ఫిక్స్ చేసుకున్నారు. ప్రశాంత్ నీల్ తన సినిమాలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ పనులకు అత్యధిక సమయం కేటాయిస్తుంటారు. అందుకే అనుకున్న సమయానికి కంటే ముందే షూటింగ్‌ను గుమ్మడికాయ కొట్టేలా పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నాయి. తారక్ రీ-ఎంట్రీతో అక్టోబర్ నుంచి షూటింగ్ మరింత జోరందుకోనుండటంతో అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.