Mythri Shashi: “ట్రైలర్ కూడా అక్కర్లేదు.. పెట్టిందల్లా ఫుల్లే!” : మైత్రీ శశి

Cinema

Mythri Shashi: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా సాధిస్తున్న అపూర్వ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఏర్పాటు చేసిన మీడియా ములాఖత్‌లో నైజాం డిస్ట్రిబ్యూటర్, మైత్రీ మూవీ మేకర్స్ ప్రతినిధి శశి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా స్టార్ హీరోల చిత్రాలకు భారీ ప్రమోషన్లు, ట్రైలర్ కట్ తప్పనిసరి. కానీ ‘ది ప్యారడైజ్’ విషయంలో అలాంటి సూత్రాలేవీ పనిచేయలేదని, ట్రైలర్ లేకపోయినా జనం థియేటర్లను ముంచెత్తుతున్నారని ఆయన విశ్లేషించారు.

సినిమాపై ఉన్న క్రేజ్ గురించి శశి చెబుతూ.. “శ్రీకాంత్ గారు మొదటి నుంచి ఇచ్చిన ప్రతి కంటెంట్ నేరుగా ప్రేక్షకుల హృదయాల్లోకి బలంగా వెళ్లిపోయింది. నిజం చెప్పాలంటే ఈ సినిమాకు అసలు ట్రైలర్ కూడా అవసరం రాలేదు! పాటలు అంతలా జనాల్లో నాటుకుపోయాయి. నిర్మాత సుధాకర్ అన్న పబ్లిసిటీకి ఎంత ఖర్చు పెట్టారో తెలియదు గానీ, వినాయకుడు మాత్రం విపరీతంగా సాయం చేశాడు. ఏ మండపం వద్ద చూసినా, ఏ గల్లీలో చూసినా ‘ఆయా షేర్’, ‘ఏషనాగులు’ పాటలే మార్మోగాయి. బయట నిమజ్జనం పూర్తయినా థియేటర్లలో మాత్రం జాతర ఇంకా కొనసాగుతూనే ఉంది” అని పేర్కొన్నారు. థియేటర్లలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ.. “మేం ఎన్నో పెద్ద సినిమాలు చూశాం, స్టార్ హీరోల చిత్రాలు డిస్ట్రిబ్యూట్ చేశాం. సాధారణంగా ఫ్యాన్స్ షోలకు, సెకండ్ షోలకు వచ్చి పాటలకి డాన్సులు చేయడం చూస్తుంటాం. కానీ ‘ది ప్యారడైజ్’ విషయంలో ప్రతి షోకూ అదే సీన్ రిపీట్ అవుతోంది. కొత్తగూడెం, సిరిసిల్ల, హైదరాబాద్ విమల్ ఇలా ఎక్కడికి ఫోన్ చేసినా ఉదయం 8 గంటల షోకే జనం స్క్రీన్ ముందుకు వెళ్లి డాన్సులు చేస్తున్నారు. మహిళలు సైతం తెర ముందుకు వచ్చి సంబరాలు చేసుకుంటున్నారంటే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంతగా సొంతం చేసుకున్నారో అర్థమవుతోంది” అని చెప్పారు.

సినిమా కొన్న తర్వాత డిస్ట్రిబ్యూటర్ల మైండ్‌సెట్ ఎలా ఉంటుందో శశి కుండబద్దలు కొట్టారు. “ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా సినిమా కొన్నప్పుడు ‘మనం పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుందా? సేఫ్ జోన్‌లోకి వెళ్తామా లేదా?’ అనే మొదట ఆలోచిస్తారు. నేను, నాగార్జున విమల్ థియేటర్‌లో మొదటి షో చూసి బయటకు వచ్చాక ఇద్దరం ఒకరి ముఖం ఒకరం చూసుకున్నాం. ‘బాస్.. మనం సేఫ్! పెట్టిన డబ్బులు నూటికి నూరు శాతం వచ్చేస్తాయి’ అని తేల్చేసుకున్నాం. ఆ తర్వాత సినిమా ఎంత పెద్ద రేంజ్ కలెక్ట్ చేస్తుందనేది ఆలోచించాం” అని అసలు విషయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ గురించి చెబుతూ.. “సాధారణంగా మేం ఎగ్జిబిటర్లను రిక్వెస్ట్ చేసి స్క్రీన్స్, షోలు వేయించుకుంటాం. కానీ ఈ సినిమాకు ఎక్కడ స్క్రీన్ వేస్తే అక్కడ పెట్టిందల్లా ఫుల్ అవుతోంది. శనివారం మార్నింగ్ షోలకే దాదాపు 95% ఆక్యుపెన్సీ నమోదవుతోందంటే ఇది మామూలు విషయం కాదు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లనేవి అసలైన కొలబద్ద. ఆ లెక్కన చూస్తే ‘ది ప్యారడైజ్’ రికార్డులను తిరగరాస్తోంది” అని స్పష్టం చేశారు. ట్రైలర్ లేకున్నా, వివాదాలు చుట్టుముట్టినా.. కేవలం కంటెంట్ బలం, పాటల ఇంపాక్ట్‌తోనే ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోందని మైత్రీ శశి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి.