SS Rajamouli: “సినిమా చూసి కళ్ల వాచేలా ఏడ్చా.. రమా చూసి భయపడిపోయింది” రాజమౌళి షాకింగ్ కామెంట్స్!

SS Rajamouli

SS Rajamouli: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఏదైనా ఒక సినిమా గురించి మాట్లాడారంటే అందులో స్పష్టత, నిజాయితీ కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. తన కుమారుడు ఎస్.ఎస్.కార్తికేయ నిర్మాతగా, మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ హీరోగా నటించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్ వేడుకలో జక్కన్న చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసినప్పుడు తాను భావోద్వేగాలను ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నానని, తన పరిస్థితి చూసి తన భార్య రమా రాజమౌళి ఒక్కసారిగా కంగారుపడిపోయిందని ఆయన స్వయంగా వెల్లడించారు.

“కళ్లు వాచిపోయేలా ఏడ్చాను.. మా ఆవిడ కంగారుపడింది”
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా అవుట్‌పుట్ గురించి రాజమౌళి మాట్లాడుతూ.. “సుమారు రెండు నెలల క్రితం రీ-రికార్డింగ్, డబ్బింగ్ కూడా పూర్తికాని ఫస్ట్ కాపీని చూశాను. సినిమా చూస్తున్నంతసేపు ఎంత పగలబడి నవ్వానో.. అంతకంటే తీవ్రంగా ఏడ్చేశాను. ఎంతలా అంటే.. నా కళ్లు పూర్తిగా వాచిపోయాయి. నా ముఖం చూసి మా ఆవిడ రమ భయపడిపోయింది.. ‘ఏమైంది నీకు? ఎందుకు కళ్లు అలా వాచిపోయాయి?’ అని ఆందోళనగా అడిగింది. నవ్వించడంతో పాటు గుండెల్ని పిండేసే ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ప్రతి ఒక్కరినీ కదిలించే అత్యద్భుతమైన సినిమా ఇది” అని జక్కన్న సినిమాపై తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

“ఒకే ఒక్క లైన్.. నా మైండ్‌లో వంద ప్రశ్నలు”
దర్శకుడు శశాంక్ ఈ సినిమా కథ చెప్పిన సందర్భాన్ని రాజమౌళి సరదాగా గుర్తుచేసుకున్నారు. “నాలుగేళ్ల క్రితం శశాంక్ వచ్చి మూడు గంటలు కథ చెబుతా అన్నాడు. ‘నాకేం పనిపాటా లేదా.. మూడు గంటలు వినడానికి? ఐదు నిమిషాల్లో చెబితే వింటా, లేదంటే పో’ అని తెగేసి చెప్పాను. దాంతో వాడు ఐదు నిమిషాలు కూడా తీసుకోకుండా కేవలం ఒకే ఒక్క ముక్కలో కథ చెప్పాడు.. ‘ఒక దెయ్యాన్ని కిడ్నాప్ చేసిన మనిషి కథ’ అన్నాడు. ఆ ఒక్క లైన్ వినగానే నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. అసలు దెయ్యాన్ని ఎలా కిడ్నాప్ చేస్తాడు? అది దెయ్యమని వాడికి తెలుసా? తెలిశాక ఏం చేశాడు? ఇలా వంద రకాల ఆలోచనలు బుర్రలో మొదలయ్యాయి. ఆ తర్వాత పూర్తి కథ విని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను” అని వివరించారు.

“ఫాఫా క్రేజ్ చూసి షాకయ్యా.. ఫహద్‌ను తొక్కేయాలని చూసింది!”
ఫహద్ ఫాజిల్ టాలెంట్‌ను తాను చాలా ఆలస్యంగా గుర్తించానని రాజమౌళి అంగీకరించారు. ఆయన నటించిన ‘ట్రాన్స్’ సినిమా చూసి మతిపోయిందని, మొదట్లో ఆయన చిత్రాలు కేవలం క్లాస్ ఆడియన్స్‌కే పరిమితం అనుకున్నానని చెప్పారు. కానీ కొన్నేళ్ల క్రితం ఆంధ్రాలోని ఓ మారుమూల పల్లెటూరుకు చెందిన మహిళ తన వద్దకు వచ్చి “నువ్వు ఫాఫా సినిమాలు చూస్తావా?” అని అడిగినప్పుడు.. తెలుగు ప్రజల్లోకి ఫహద్ ఎంత లోతుగా చొచ్చుకుపోయాడో అర్థమైందని తెలిపారు. అలాగే సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ సారా గురించి మాట్లాడుతూ.. “పైకి ముద్దుముద్దుగా కనిపిస్తూ ‘సూరి నా బెస్ట్ ఫ్రెండ్’ అని చెబుతుంది కానీ, సెట్‌లో మాత్రం ఫహద్ ఫాజిల్‌ను యాక్టింగ్‌లో తొక్కేయాలన్నంత కసితో నటించింది. ఆ చిన్నపిల్ల పోటీని తట్టుకోవడం ఫహద్‌కు నిజంగా పెద్ద పరీక్షే” అంటూ చమత్కరించారు.

తారక్ ‘డ్రాగన్’ డిలే అవ్వదు..
జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. తన తమ్ముడు కార్తికేయ ఈవెంట్ కాబట్టే తారక్ వచ్చాడని, అతనికి థాంక్స్ చెబితే చిన్నబోతుందని అన్నారు. ఫ్యాన్స్ మాదిరిగానే రెక్కలు చాచి, నోట్లోంచి నిప్పులు కక్కే ‘డ్రాగన్’ కోసం తానూ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నానని చెప్పారు. లోపల తారక్‌ను స్వయంగా గ్రిల్ చేశానని, ఎలాంటి డిలే లేకుండా సినిమా అనుకున్న సమయానికే వస్తుందని క్లారిటీ ఇచ్చారు.

ఇక తనయుడు కార్తికేయ గురించి చెబుతూ.. “వాడిలో నాకు బాగా నచ్చిన లక్షణం వ్యాపార నీతి. బిజినెస్‌లో తనకు అర్ధ రూపాయి లాభం రావడం ఎంత ముఖ్యమో.. తనతో వ్యాపారం చేసిన అవతలి వ్యక్తికి కూడా ఆ అర్ధ రూపాయి దక్కాలని ఆరాటపడతాడు. ఈ స్వభావం ఉన్నవాళ్లు జీవితంలో చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతారు” అని రాజమౌళి గర్వంగా చెప్పుకొచ్చారు. చిన్నపిల్లల సినిమా అనే అపోహ వీడి, ప్రతి ఒక్కరిలో దాగున్న చిన్నతనాన్ని తట్టిలేపే ఈ అందమైన ప్రయాణాన్ని అక్టోబర్ 2న థియేటర్లలో చూడాలని రాజమౌళి పిలుపునిచ్చారు.