
TG Vishwa Prasad: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి కాంబినేషన్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన భారీ చిత్రం ‘ది రాజాసాబ్’. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. కాగా, తాజాగా హీరోయిన్ ఆనంది ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘గరివిడి లక్ష్మి’ సినిమా ప్రెస్ మీట్లో పాల్గొన్న నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు ‘రాజాసాబ్’ ఫలితంపై మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. “రాజాసాబ్ ఫెయిల్యూర్ వెనుక మీ కారణాలు ఏంటి? ఎక్కడ తప్పు జరిగింది?” అని మీడియా ప్రతినిధులు అడగ్గా, ఆయన ఏమాత్రం దాటవేయకుండా అత్యంత నిజాయితీగా స్పందించారు. సినిమా ఫలితంపై టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. “రాజాసాబ్ విషయంలో జరిగిన ప్రధానమైన ఫండమెంటల్ మిస్టేక్ ఏంటంటే, ఆ చిత్రం సరైన సీజన్లో విడుదల కాకపోవడం. ఒకవేళ ఆ సినిమా వేరే ఏదైనా మంచి టైమ్‌లో థియేటర్లలోకి వచ్చి ఉంటే రిజల్ట్ కచ్చితంగా మరోలా ఉండేది” అని పేర్కొన్నారు.
దీనికి తోడు రిలీజ్ సమయంలో జరిగిన మరికొన్ని తప్పిదాలు సినిమాపై తీవ్ర ప్రభావం చూపాయని ఆయన అంగీకరించారు. “రిలీజ్ రోజున ప్రీమియర్ షోలు ఆలస్యం కావడం, టికెట్ రేట్లను పెంచడానికి ప్రయత్నించడం సినిమాకు పెద్ద మైనస్‌గా మారాయి. నిజానికి మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టికెట్ ధరలు పెంచాలని ట్రై చేసిన మొదటి సినిమా అదే. అసలు ఆ పనే చేసి ఉండకూడాల్సింది. ఈ రేట్ల పెంపు వ్యవహారం వల్లే షోల ప్రదర్శన ఆలస్యమై, అప్పటికే ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానుల్లో తీవ్ర అసహనం, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది” అంటూ ఓపెన్‌గా చెప్పుకొచ్చారు. సొంత బ్యానర్ సినిమా ఫలితంపై, అందులోనూ ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్ ప్రాజెక్ట్ వెనుక జరిగిన లోపాలపై నిర్మాత విశ్వప్రసాద్ ఇంత కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.














