
Prabhas Surprises: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కేవలం వెండితెర రికార్డులకే కాదు, తోటి నటీనటులకు ఆయన పంచే ప్రేమ, చూపించే ఆతిథ్యానికి కూడా పెట్టింది పేరు. సెట్స్‌లో ఎవరైనా పనిచేస్తున్నారంటే చాలు.. ఇంటి నుంచి లెక్కలేనన్ని రకాల నోరూరించే వంటకాలతో విందు పంపడం డార్లింగ్‌కు అలవాటు. ఇప్పటికే ఎంతో మంది అగ్ర హీరోయిన్లు, తోటి నటులు ఆయన ‘రాజుగారి విందు’ రుచి చూసి ఆశ్చర్యపోయిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా ఈ అరుదైన మర్యాద ‘ఫౌజీ’ కథానాయిక ఇమాన్వికి అనుభవంలోకి వచ్చింది.
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ డ్రామా ‘ఫౌజీ’. ఈ సినిమాతో టాలీవుడ్‌కి కథానాయికగా పరిచయమవుతున్న ఇమాన్వి పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ అదిరిపోయే సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఒక భారీ డైనింగ్ టేబుల్ మొత్తం నిండిపోయేలా రకరకాల ప్రత్యేక వంటకాలతో ఘనమైన విందును ఆమె వద్దకు పంపించారు. ఎదురుగా ఉన్న వెరైటీలను చూసి ముగ్ధురాలైన ఇమాన్వి, ఆ విందు ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
“నా హృదయం, కడుపు రెండూ శాశ్వతంగా నిండిపోయాయి.. థాంక్యూ ప్రభాస్ గారు” అంటూ ఇమాన్వి పెట్టిన పోస్ట్ నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది. తొలి సినిమానే అంత పెద్ద సూపర్‌స్టార్ సరసన చేస్తున్న ఈ యంగ్ బ్యూటీకి, ప్రభాస్ ఇంతటి ఆప్యాయత చూపించడం మెగా అభిమానులతో పాటు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఈ తాజా హ్యాపెనింగ్స్ ద్వారా మరింత పాజిటివ్ బజ్ నెలకొంది.














