
Simran: ఒకప్పుడు వెండితెరపై దళపతి విజయ్, స్టార్ హీరోయిన్ సిమ్రాన్‌ల జోడీ సృష్టించిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ‘తుళ్లత్త మనముమ్ తుళ్లుమ్’, ‘ప్రియమనవలె’ వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ఈ జంట ప్రేక్షకుల మనసు దోచుకుంది. అయితే, ఇన్నాళ్లకు ఈ ఎవర్‌గ్రీన్ కాంబినేషన్ మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అభిమానులకు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది. కాకపోతే ఈసారి సినిమా సెట్‌లో కాదు.. తమిళనాడు సచివాలయంలో. తాజాగా నటి సిమ్రాన్ తన భర్త దీపక్ బాజ్వా, ఇద్దరు కుమారులతో కలిసి సీఎం విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం బాధ్యతలు స్వీకరించిన విజయ్‌కు ఆమె తన కుటుంబ సమేతంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను తాజాగా సిమ్రాన్ తన సోషల్ మీడియా అకౌంట్లో అభిమానులతో పంచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
విజయ్‌తో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. “చాలా సంవత్సరాల క్రితం వెండితెరపై కలిసి నటించాం. ఇన్నాళ్లకు సీఎం విజయ్ గారిని నా కుటుంబంతో కలిసి కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అప్పట్లో ఎంతో మందిని ఆయన వైపు తిప్పుకున్న ఆ ఆప్యాయత, వినయం, నిజాయితీ ఇప్పటికీ ఆయనలో అలాగే ఉన్నాయి. అందులో ఎలాంటి మార్పు రాలేదు” అని ఆమె కొనియాడారు. “రాష్ట్ర ప్రగతి కోసం ఆయన పడుతున్న తపన, ఆయనకున్న స్పష్టమైన విజన్ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అవి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. రాష్ట్రాన్ని విజయపథంలో ముందుకు నడిపిస్తున్న సీఎం విజయ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అని సిమ్రాన్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఒకప్పటి తమ ఫేవరెట్ ఆన్‌స్క్రీన్ జోడీ, ఇలా ‘హీరో టు సీఎం’ ప్రయాణంలో సరికొత్తగా కనిపించడంతో అభిమానులు ఈ ఫొటోలను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
Years after sharing screen space together, it was a pleasure to meet Hon'ble Chief Minister Thiru @actorvijay avargal with my family. The warmth, humility, and sincerity that endeared him to so many people remain exactly the same! His passion and vision for the progress of our… pic.twitter.com/MUDcBChzt3
— Simran (@SimranbaggaOffc) June 15, 2026









