Anand Deverakonda: ‘ఎపిక్’ మనందరి కథ.. చాలా నేచురల్‌గా కనెక్ట్ అవుతారు: ఆనంద్ దేవరకొండ

Anand Deverakonda

Anand Deverakonda: హైదరాబాద్‌లో జరిగిన ‘ఎపిక్’ ఫస్ట్ సెమిస్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో ఆనంద్ దేవరకొండ ప్రత్యేక సందడి చేశారు. ఈ సందర్భంగా తన సినిమా గురించి, డైరెక్టర్ ఆదిత్య హాసన్, హీరోయిన్ వైష్ణవి చైతన్యతో పాటు తన అన్న విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ‘ఎపిక్’ కథ ప్రతి ఒక్కరి జీవితానికి దగ్గరగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ‘ఎపిక్’ అనేది మనందరినీ ప్రతిబింబించే సినిమా అని ఆనంద్ దేవరకొండ అన్నారు. 23 నుంచి 26 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికీ ఐడెంటిటీ, ప్రేమ, బాధ్యతలు, కుటుంబం, భవిష్యత్తు వంటి ఎన్నో ఆలోచనలు ఉంటాయని.. అలాంటి భావోద్వేగాలు, పరిస్థితులను సినిమాలో న్యాచురల్‌గా చూపించామని తెలిపారు.

‘‘సినిమాలో పెద్ద కమర్షియల్ ట్విస్టులు, ఇంటర్వెల్ బ్యాంగ్స్, క్లైమాక్స్‌లో భారీ యాక్షన్ ఉండాల్సిన అవసరం లేదు. ఇద్దరు వ్యక్తులు కూర్చొని తమ జీవితాల్లోని ఇన్సెక్యూరిటీస్, పరిస్థితులు, ఎదురయ్యే సమస్యల గురించి మాట్లాడుకుంటే కూడా గొప్ప సినిమా చేయొచ్చు’’ అని తాను నమ్ముతానని ఆనంద్ చెప్పారు. ‘ఎపిక్’ కూడా అలాంటి సహజమైన, అందరికీ రిలేట్ అయ్యే ప్రేమకథ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆదిత్య హాసన్‌పై ఆనంద్ ప్రశంసలు కురిపించారు. ‘90s’ వెబ్ సిరీస్ ద్వారా ఆదిత్య తన రచనతో ఆకట్టుకున్నారని, సాధారణ జీవితంలోని చిన్న చిన్న సంఘటనలను కూడా ఎంతో ఆసక్తికరంగా, సినిమాటిక్‌గా చూపించడం ఆయన ప్రత్యేకత అని అన్నారు. ‘90s’ విజయానికి కూడా అదే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు.

మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం తనకు ఎంతో ఇష్టమని ఆనంద్ తెలిపారు. ‘ఎపిక్’కు ఆయన అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు. సినిమా టీజర్, ట్రైలర్ కూడా బాగున్నాయని పేర్కొన్నారు. ఇక తన అన్న విజయ్ దేవరకొండ గురించి ఆనంద్ ప్రత్యేకంగా మాట్లాడారు. తమ కుటుంబంలో ఒక వ్యక్తి వచ్చి మొత్తం పరిస్థితిని మార్చి కుటుంబాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. ఆయనే మా అన్నా
విజయ్. తను మా కుటుంబానికి చాలా చేశారు. ‘కింగ్డమ్’ సినిమాలోని అన్నా అంటేనే అనే పాట తమ అన్నదమ్ముల బంధాన్ని సరిగ్గా ప్రతిబింబిస్తుందని తెలిపారు. విజయ్ తన కుటుంబానికి చేసిన సాయాన్ని గుర్తుచేసుకుంటూ ఆనంద్ ఎమోషనల్ అయ్యారు. తాను చదువుకోవడానికి అమెరికా వెళ్లిన సమయంలో కుటుంబంపై ఉన్న ఆర్థిక భారం తగ్గేలా విజయ్ ఉద్యోగం సంపాదించడంతో ఎంతో ఊరట కలిగిందని చెప్పారు. సాధారణ జీవితంలో ఇలాంటి చిన్న చిన్న సందర్భాలే అసాధారణమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని అన్నారు.

‘ఎపిక్’లో విలన్ అంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండరని ఆనంద్ వెల్లడించారు. గ్రే షేడ్ ఉన్న పాత్ర కూడా లేదని, జీవితంలో ఎదురయ్యే సహజమైన పరిస్థితులు, ప్రేమ, బాధ్యతలు, గందరగోళం చుట్టూనే కథ సాగుతుందని తెలిపారు. అందుకే ప్రేక్షకులు ఈ సినిమాతో బాగా కనెక్ట్ అవుతారని ధీమా వ్యక్తం చేశారు. సీనియర్ నటులు శివాజీ, వాసుకి వంటి వారు సినిమాలో కీలక పాత్రలు పోషించారని ఆనంద్ చెప్పారు. ‘90s’లో కనిపించిన చిన్నారి ఆదిత్య పాత్రకు ఇది ఒక రకమైన స్పిన్‌ఆఫ్‌లా ఉంటుందని, అతను పెద్దయ్యాక విదేశాలకు వెళ్లి ప్రేమలో పడితే ఎదురయ్యే పరిస్థితులను ‘ఎపిక్’లో చూపించామని వివరించారు.

ఇక ‘ఎపిక్’ ఒక సీక్వెల్ కాదని ఆనంద్ స్పష్టం చేశారు. ‘90s’ కథకు కొనసాగింపుగా కాకుండా, ఆ పాత్ర ఆధారంగా మరో జీవిత కథను చూపించే ప్రయత్నమే ‘ఎపిక్’ అని తెలిపారు. సెప్టెంబర్ 11న ‘ఎపిక్’ థియేటర్లలోకి రానుండగా.. సెప్టెంబర్ 10న ప్రీమియర్స్ ఉంటాయని ఆనంద్ తెలిపారు. ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు. సాధారణంగా సినిమాలకు హ్యాపీ ఎండింగ్ లేదా సాడ్ ఎండింగ్ ఉంటుందని.. కానీ ‘ఎపిక్’లో మాత్రం భిన్నమైన ముగింపు ఉంటుందని ఆనంద్ వెల్లడించారు. ఇది ‘అన్‌ఫినిష్డ్ స్టోరీ’లా అనిపించినప్పటికీ ప్రేక్షకులకు మాత్రం కథ పూర్తయిన అనుభూతిని ఇస్తుందని చెప్పారు. మన జీవితాలు ఒక పెళ్లితో లేదా ఒక సంఘటనతో ముగిసిపోవని.. ఆ తర్వాత కూడా ఎన్నో కథలు కొనసాగుతూనే ఉంటాయని వివరించారు. చివరగా సెప్టెంబర్ 11న థియేటర్లలో ‘ఎపిక్’ను చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలని ఆనంద్ దేవరకొండ కోరారు.