Drishyam 3 తెలుగు ఓటీటీ రిలీజ్‌కు బ్రేక్.. ఎందుకో తెలుసా?

Drishyam

Drishyam 3: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన మోస్ట్ అవేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ (Drishyam 3) తెలుగు వెర్షన్ డిజిటల్ రిలీజ్‌కు ఊహించని చట్టపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ సినిమా తెలుగు హక్కులపై తీవ్ర వివాదం తలెత్తడంతో మద్రాస్ హైకోర్టు స్పందించి, తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో రిలీజ్ చేయకుండా ప్రతివాదులపై తాత్కాలిక మధ్యంతర స్టే విధిస్తూ సంచలన ఆర్డర్ పాస్ చేసింది. నిజానికి ఈ చిత్రం జూన్ 18 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రావాల్సి ఉండగా, ఈ తాజా కోర్టు ఆర్డర్ కారణంగా తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ ఆగిపోయింది.

గతంలో వచ్చిన ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ సినిమాలు తెలుగులో విక్టరీ వెంకటేశ్ హీరోగా రీమేక్ అయి భారీ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడో భాగాన్ని తెలుగులో రీమేక్ చేయకుండా నేరుగా డబ్బింగ్ వెర్షన్‌గా ఓటీటీలోకి తీసుకురావాలని నిర్మాతలు నిర్ణయించారు. ఇదే ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. తెలుగులో మొదటి భాగాన్ని తెరకెక్కించిన ప్రముఖ సీనియర్ దర్శకురాలు శ్రీప్రియ సేతుపతి, ఆమె భర్త రాజ్‌కుమార్ సేతుపతికి చెందిన ప్రసిద్ధ నిర్మాణ సంస్థ ‘రాజ్‌కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ తమ మేధో సంపత్తి హక్కులను (Copyrights) కాపాడుకోవడానికి న్యాయపోరాటానికి దిగింది. ‘దృశ్యం’ ఫ్రాంచైజీకి సంబంధించిన సంపూర్ణ తెలుగు హక్కులు తమకే చెందుతాయని, తమ అనుమతి లేకుండా మూడో భాగాన్ని డబ్బింగ్ రూపంలో విడుదల చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ వారు మద్రాస్ హైకోర్టులో దావా వేశారు.

Also Read :  Jagapathi Babu: 'నిజజీవితంలో నటించాల్సిన అవసరం నాకు లేదు': జగపతి బాబు

ఈ కేసులో ఆశీర్వాద్ సినిమాస్ అధినేత ఆంటోనీ పెరుంబవూర్, డైరెక్టర్ జీతూ జోసెఫ్, పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌లను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వివాదంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. కేసు తేలేవరకు ‘దృశ్యం 3’ తెలుగు వెర్షన్‌ను ఓటీటీలలో రిలీజ్ చేయకూడదని ఆదేశించింది. ఈ చట్టపరమైన పరిణామాల నేపథ్యంలో రాజ్‌కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చిత్ర పరిశ్రమ వర్గాలకు ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులు అమలులో ఉన్నందున ఏ నిర్మాత, పంపిణీదారుడు, ఫైనాన్షియర్ లేదా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘దృశ్యం 3’ తెలుగు హక్కులకు సంబంధించి ఎలాంటి అగ్రిమెంట్స్ చేసుకోకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమించి డీల్స్ కుదుర్చుకుంటే, భవిష్యత్తులో వచ్చే చట్టపరమైన పరిణామాలకు వారిదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేసింది. కోర్టు తదుపరి విచారణలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేదానిపైనే ఈ సినిమా తెలుగు ఓటీటీ విడుదల ఆధారపడి ఉంది.