Pawan Kalyan: అల్లికలతో అలసిన కళ్లకు కొత్త వెలుగులు… క్రోచెట్ కళాకారులకు అండగా పవన్ కళ్యాణ్

Pawan Kalyan

Pawan Kalyan: క్రోచెట్ లేస్ కళాకారుల కష్టాలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్, వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపే చర్యలు చేపట్టారు. గత నెల విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ హస్తకళా మహోత్సవంలో కళాకారులతో మమేకమైన ఆయన, వారి ఆరోగ్య సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. నరసాపురం నియోజకవర్గంలోని పసలదీవికి చెందిన క్రోచెట్ లేస్ కళాకారిణి మహాలక్ష్మి, గంటల తరబడి సూక్ష్మమైన అల్లికలు చేయడం వల్ల చూపు మందగిస్తోందని, కంటి పరీక్షలు నిర్వహించాలని కోరగా వెంటనే స్పందించారు.

ఆ వేదికపైనే రాష్ట్రవ్యాప్తంగా హస్తకళాకారుల కోసం క్లస్టర్ల వారీగా ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆ మేరకు నరసాపురంలో నిర్వహించిన తొలి నేత్ర వైద్య శిబిరంలో పరీక్షలు చేసిన వైద్యులు 141 మంది క్రోచెట్ లేస్ కళాకారులకు కళ్లజోళ్లు అవసరమని సూచించారు. దీంతో వారందరికీ కళ్లజోళ్లు సిద్ధం చేయించి పంపించాలని శ్రీ పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నారు. వైద్య పరీక్షలతోనే ఆగిపోకుండా, అవసరమైన సహాయాన్ని అందించడం కళాకారుల్లో ఆనందాన్ని నింపింది.

ఇదే కార్యక్రమాన్ని మరింత విస్తరించే దిశగా పాలకొల్లు పరిధిలోని యలమంచిలి, అత్తిలిలో నిర్వహించిన మరో రెండు నేత్ర వైద్య శిబిరాల్లో కూడా దృష్టి లోపాలతో బాధపడుతున్న సుమారు 350 మంది కళాకారులను గుర్తించారు. వీరికీ కళ్లజోళ్లు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే 20 మందికిపైగా కంటిశుక్లం సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించగా, వారికి శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. త్వరలో ఆచంట, నరసాపురంలో మరో రెండు ఉచిత నేత్ర వైద్య శిబిరాలను నిర్వహించి మరింత మంది క్రోచెట్ లేస్ కళాకారులకు ఆరోగ్య సేవలు అందించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.