Fahadh Faasil: “ఆ సూపర్ స్టార్ వెనుక ఉన్న అసలైన మనిషిని చూశా” ఫహద్ ఫాజిల్ సంచలన వ్యాఖ్యలు!

Fahadh Faasil

Fahadh Faasil: భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యంత విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ తొలిసారి నేరుగా నటిస్తున్న తెలుగు చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఎస్.ఎస్. రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ నిర్మించిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. అయితే ఈ వేదికపై ఫహద్ ఫాజిల్ మాట్లాడిన మాటలు, ముఖ్యంగా ఎన్టీఆర్‌తో తనకున్న వ్యక్తిగత సాన్నిహిత్యం గురించి బయటపెట్టిన రహస్యాలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

తారక్ ఒక అద్భుతం
ఎన్టీఆర్ గురించి ఫహద్ ఫాసిల్ మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. స్క్రీన్ మీద కనిపించే సూపర్ స్టార్ తారక్ వెనుక ఉన్న ఒక గొప్ప మనిషిని తాను దగ్గరుండి చూశానని ఫహద్ వెల్లడించారు. “సినిమా మొదలైనప్పటి నుంచి నాకు, కార్తికేయకు తారక్ ఇచ్చిన సపోర్ట్ వెలకట్టలేనిది. నిత్యం మా గురించి ఆరా తీస్తూ అండగా నిలిచారు. ఒకరోజు తారక్ ఇంటికి వెళ్లినప్పుడు వారి కుటుంబం నన్ను సొంత మనిషిలా చూసుకుంది. ఆ రాత్రి మేమిద్దరం తెల్లవారుజామున 3 గంటల వరకు ఏకధాటిగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల గురించి చర్చించాం. ఆ క్షణాలను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. తెరపై ఆయనో తిరుగులేని సూపర్ స్టార్.. కానీ ఆ స్టార్‌డమ్ వెనుక ఒక అద్భుతమైన మనిషి ఉన్నాడు. అలాంటి గొప్ప వ్యక్తినేను నా జీవితంలో కలవడం ఒక అదృష్టంగా భావిస్తున్నా” అంటూ ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని ఆకాశానికెత్తేశారు ఫహద్.

“ఒంటరిగా ఉన్నప్పుడు కార్తికేయ తోడుగా నిలిచాడు”
నిర్మాత ఎస్.ఎస్.కార్తికేయ గురించి చెబుతూ ఫహద్ మరింత ఎమోషనల్ అయ్యారు. “నేను ఆత్మవిశ్వాసం కోల్పోయిన సమయాల్లో నాకు వెన్నుదన్నుగా నిలిచింది కార్తికేయనే. ఒంటరిగా ఫీలైనప్పుడు స్నేహం అందించాడు. ప్రతిఫలంగా నా నుంచి ఏదీ ఆశించకుండా స్వచ్ఛమైన ప్రేమను పంచాడు. జీవితాంతం వాడికి రుణపడి ఉంటాను. అలాగే దేవుడు అన్ని చోట్లా ఉండలేక తల్లులను సృష్టించాడంటారు.. రమా రాజమౌళి గారిని చూస్తే అదే గుర్తొస్తుంది. ఆమెను చూసినప్పుడు ఇంట్లో ఉన్న భావనే కలిగింది. ఇక కనిపించని రక్షక దేవదూతలా మా వెనుక ఉండి నడిపించిన రాజమౌళి సార్ నాకు అసలైన హీరో” అని పేర్కొన్నారు.

భార్యకు దూరంగా ఏడాది పాటు కష్టం.. హైదరాబాద్‌తో ప్రేమ!
హైదరాబాద్ నగరంతో తనకు ఐదేళ్ల అనుబంధం ఉందని, ఇక్కడి ఇరానీ ఛాయ్, ఉస్మానియా బిస్కెట్లు, బిర్యానీ అంటే విపరీతమైన ఇష్టమని ఫహద్ సరదాగా గుర్తుచేసుకున్నారు. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా కోసం హైదరాబాద్ నడిబొడ్డున దాదాపు 90 శాతం లైవ్ లొకేషన్లలో షూటింగ్ చేశామని చెప్పారు. “ఈ సినిమా కోసం నా భార్య నజ్రియాకు ఏడాది పాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. పెళ్లయ్యాక మేమిద్దరం ఇంత సుదీర్ఘ కాలం వేర్వేరుగా ఉండటం ఇదే తొలిసారి. ఆమె కూడా చెన్నైలో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉంది. అందుకే ఈ చిత్రం నాకెంతో ప్రత్యేకం. మా నాన్న కూడా నేను స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నారు. ఇది నా మొదటి సినిమా అనే భావన కలుగుతోంది” అని చెప్పారు.

తెలుగు ప్రేక్షకులకిది నా ప్రేమలేఖ
తెలుగు సినిమా తనను ఎప్పటినుంచో తీవ్రంగా ప్రభావితం చేసిందని ఫహద్ తెలిపారు. ‘స్వాతిముత్యం’, ‘అంతఃపురం’, ‘ఈగ’ లాంటి క్లాసిక్ చిత్రాల్లో నటించాలని తనకు ఎంతో కోరికగా ఉండేదని గుర్తుచేసుకున్నారు. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రం తెలుగు ప్రేక్షకులకు తాను రాసిన ఒక అందమైన ప్రేమలేఖ అని, ప్రతి ఒక్కరూ థియేటర్లలోనే చూసి ఈ మ్యాజిక్‌ను ఆస్వాదించాలని ఫహద్ ఫాసిల్ కోరారు.