Jr NTR: ‘లెనిన్’ ప్రమోషన్స్‌లో జూనియర్ ఎన్టీఆర్.. కానీ!

Lenin

Jr NTR: అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ (LENIN). జూలై 10న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్‌లో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మనం ఎంటర్‌ప్రైజెస్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ‘లెనిన్’ సినిమా ప్రమోషన్స్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్.. అఖిల్‌తో కలిసి ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నారని, దానికి సంబంధించిన ప్లాన్స్ కూడా పూర్తయ్యాయని జోరుగా ప్రచారం సాగింది. నందమూరి, అక్కినేని హీరోలు ఒకే ఫ్రేమ్‌లో ఇంటర్వ్యూ ఇస్తున్నారనే వార్త నెట్టింట వైరల్‌గా మారడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

అయితే తాజాగా ఈ ప్రచారంపై చిత్ర యూనిట్ స్పష్టతనిచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చేసింది. అఖిల్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఎలాంటి ఇంటర్వ్యూ ప్లాన్ చేయలేదని, అవన్నీ కేవలం పుకార్లేనని స్పష్టం చేసింది. అయితే ఇదే సమయంలో నందమూరి అభిమానులకు ఒక గుడ్ న్యూస్ కూడా అందించింది. జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగం కాబోతున్న మాట వాస్తవమేనని, రాబోయే రోజుల్లో ఆయన ఈ సినిమాను విభిన్న రీతిలో ప్రమోట్ చేయనున్నారని మేకర్స్ హింట్ ఇచ్చారు. బహుశా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.