Lucky Baskhar 2: బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్ ఫిక్స్.. ‘లక్కీ భాస్కర్ 2’పై వెంకీ అట్లూరి క్లారిటీ

Lucky Baskhar

Lucky Baskhar 2: స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వచ్చిన ‘లక్కీ భాస్కర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అపూర్వ విజయాన్ని అందుకుంది. 1992 స్టాక్ మార్కెట్ స్కామ్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం విభిన్నమైన కథనం, దుల్కర్ అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ తర్వాత దీనికి సీక్వెల్ ఉంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తాజాగా డైరెక్టర్ వెంకీ అట్లూరి ‘లక్కీ భాస్కర్ 2’పై కీలక అప్డేట్ ఇచ్చారు. ‘లక్కీ భాస్కర్ 2’ సినిమా తప్పకుండా ఉంటుందని స్పష్టం చేసిన వెంకీ అట్లూరి.. అయితే ప్రేక్షకులు మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుందని తెలిపారు. ఫస్ట్ పార్ట్ భారీ విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్‌పై బాధ్యత మరింత పెరిగిందని, ప్రేక్షకుల అంచనాలను అందుకునే స్థాయిలో కథను సిద్ధం చేయాలనే ఉద్దేశంతో తొందరపడటం లేదని వెల్లడించారు. ప్రస్తుతం తన చేతిలో ఉన్న రెండు ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాతే ‘లక్కీ భాస్కర్ 2’ పనులను ప్రారంభిస్తానని ఆయన తెలిపారు. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ సీక్వెల్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుల్కర్ సల్మాన్ నటనపై ప్రశంసలు కురిపించారు. సాధారణ వ్యక్తి పాత్రల్లో దుల్కర్ అద్భుతంగా ఒదిగిపోతారని అన్నారు. ‘మహానటి’, ‘సీతారామం’ సినిమాల్లో ఆయన చేసిన పాత్రలు దీనికి ఉదాహరణగా నిలుస్తాయని తెలిపారు. ‘లక్కీ భాస్కర్’ కథ ఎలా పుట్టిందో కూడా వెంకీ అట్లూరి వెల్లడించారు. ‘సార్’ సినిమా తర్వాత ఎక్కువగా సందేశాలు ఇవ్వడం వల్ల, ఈసారి ఎలాంటి మెసేజ్ లేకుండా ఓ పూర్తి స్థాయి కాన్ ఫిల్మ్ చేయాలని భావించినట్లు తెలిపారు. 1992 స్టాక్ మార్కెట్ స్కామ్ ఆధారంగా సినిమా చేయాలని అనుకున్నప్పటికీ, కేవలం ఒక వ్యక్తి కథగా కాకుండా ఆ వ్యవస్థలో భాగమైన మరికొందరి కోణాన్ని చూపించాలనే ఆలోచనతో కథను మార్చినట్లు చెప్పారు. అందులో భాగంగానే ఓ సాధారణ బ్యాంక్ క్యాషియర్‌ను ప్రధాన పాత్రగా తీసుకుని, అతడు ఎలా స్కామ్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడనే అంశాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు తెలిపారు. ఈ సినిమా స్క్రిప్ట్ రాయడం తన కెరీర్‌లోనే అత్యంత కష్టమైన ప్రక్రియ అని, షేర్ మార్కెట్, ట్రేడింగ్ అంశాలపై అవగాహన కోసం నిపుణుల సలహాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో మరింత బలమైన కథతో ‘లక్కీ భాస్కర్ 2’ను ప్రేక్షకుల ముందుకు రావాలనే ఉద్దేశంతో సమయం తీసుకుంటున్నట్లు ఆయన చెప్పడంతో.. దుల్కర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.