Mr.Middle Class: జూలై 17న ప్రేక్షకుల ముందుకు ‘మిస్టర్ మిడిల్ క్లాస్’..

WhatsApp Image 2026 07 13 at 2.05.28 AM

Mr.Middle Class: టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ సోషల్ మీడియాలో ఈ సినిమా పోస్టర్‌ను పంచుకుంటూ.. “శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో చాలా కాలంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను మీ ముందుకు తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులను నవ్విస్తుంది, భావోద్వేగానికి గురి చేస్తుంది, కుటుంబ సభ్యులందరినీ ఒక్కచోట చేర్చేలా ఉంటుంది. జూలై 17న థియేటర్లలో కలుద్దాం” అని రాసుకొచ్చారు.

ఈ చిత్రంలో శ్రీకాంత్ సరసన లయ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సునీల్, వెన్నెల కిషోర్, అలీ, పృథ్వీరాజ్, ధనరాజ్, ప్రభాస్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు వినోదానికి పెద్దపీట వేసిన ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం అందించగా, ఛోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. కుటుంబ సమేతంగా చూసే వినోదాత్మక చిత్రంగా ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ను తెరకెక్కించినట్లు చిత్రబృందం చెబుతోంది. జూలై 17న విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.