
Mrunal Thakur: వెండితెరపై ప్రేమకథలు కేవలం వినోదాన్ని మాత్రమే పంచవు.. కొందరి ఆలోచనలపై, వారి వ్యక్తిగత జీవితాలపై చెరగని ముద్ర వేస్తాయి. ముఖ్యంగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తెరపై పండించిన రొమాన్స్ చూసి పెరిగిన అమ్మాయిలకు, నిజ జీవితంలో ప్రేమపై ఉండే అంచనాలు ఆకాశాన్ని తాకుతుంటాయి. సరిగ్గా ఇదే విషయాన్ని ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ ఎంతో సరదాగా, అంతే మనసువిప్పి పంచుకున్నారు. తన జీవితంలో షారుక్ ఖాన్ లాంటి వ్యక్తి లేకపోవడం తన మనసును తీవ్రంగా బాధిస్తోందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ, వెండితెర రొమాన్స్ తన వ్యక్తిగత ఆలోచనలను ఎలా ప్రభావితం చేసిందో చెప్పుకొచ్చారు. “నా జీవితంలో షారుక్ ఖాన్ లేడనే విషయం నా మనసును ముక్కలు చేస్తోంది. రొమాన్స్ విషయంలో ఆయన క్రియేట్ చేసిన బెంచ్‌మార్క్ అంత తేలిగ్గా ఎవరూ అందుకోలేరు. ఆయనంటే నాకు విపరీతమైన ఇష్టం. తెరపై ఆయన చేసిన పాత్రలంటే ఎంతో పిచ్చి. కానీ నిజ జీవితంలో మాత్రం ఇప్పటివరకు షారుక్ అంత రొమాంటిక్ మనస్తత్వం ఉన్న వ్యక్తిని నేను కలవలేదు” అంటూ ఓపెన్‌గా చెప్పారు. బాలీవుడ్ చిత్రాల ప్రభావంతో తన మనసులో ప్రేమ పట్ల అంచనాలు బాగా పెరిగిపోయాయని ఆమె పరోక్షంగా ఒప్పుకున్నారు.
ఇదే సందర్భంగా గతకాలపు చిత్రాల్లోని రొమాన్స్‌కు, ప్రస్తుత పరిస్థితులకు మధ్య ఉన్న తేడాలను మృణాల్ విశ్లేషించారు. “ఇప్పుడు పాత ఐకానిక్ సినిమాలను మళ్లీ చూస్తే.. కొన్ని సన్నివేశాలు చూసి ‘అసలు ఇలా ఎందుకు తీశారు?’ అనిపిస్తుంది. అయితే అప్పటి రోజులు వేరు. సోషల్ మీడియా ప్రభావం లేని ఆ కాలంలో కేవలం కాలక్షేపం కోసమే సినిమాలు చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. ముఖ్యంగా మహిళలకు తమ నిర్ణయాలను స్వేచ్ఛగా ఎంచుకునే అవకాశాలు లభిస్తున్నాయి. ఇలాంటి ఆధునిక కాలంలో పుట్టినందుకు ఎంతో గర్వపడుతున్నాను” అని తెలిపారు. సినిమాలు సమాజంపై చూపే ప్రభావం గురించి చెబుతూ, సినిమా అనేది చూసేవారి దృక్పథంపై ఆధారపడి ఉంటుందని, కొందరు కేవలం వినోదంగా చూసి వదిలేస్తే మరికొందరు పాఠాలు నేర్చుకుంటారని పేర్కొన్నారు. కాగా, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న మృణాల్ ఠాకూర్ ఇటీవల ‘పూజా మేరీ జాన్’ అనే క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో నటించారు. ఇందులో హ్యూమా ఖురేషి, విజయ్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం ఈ భామ షారుక్‌పై కురిపించిన ప్రేమాభిమానాల ముచ్చటే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నడుస్తోంది.













