Censor Issues: అప్సరసల విషయంలో అభ్యంతరాలు.. ‘రంభ ఊర్వశి మేనక’కు సెన్సార్ షాక్!

Rambha Urvashi Menaka

Censor Issues: అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రంభ ఊర్వశి మేనక’ విడుదలకు ముందే వార్తల్లో నిలిచింది. ‘కామెడీ గోజ్ కాస్మిక్’ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్‌ ప్రస్తుతం సెన్సార్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. సినిమాలో అప్సరసల పాత్రలను, వారిని చూపించిన విధానంపై సెన్సార్ అధికారులు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే దేవతలను సినిమాలో చిత్రీకరించిన తీరుపైనా ప్రశ్నలు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో చిత్రబృందం ఇప్పుడు రివ్యూ కమిటీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. సెన్సార్ సమస్యల నేపథ్యంలో సోమవారం రివ్యూ కమిటీ సినిమా విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కమిటీ నుంచి ఎలాంటి తీర్పు వస్తుందనే దానిపై ప్రస్తుతం చిత్రబృందంలో ఉత్కంఠ నెలకొంది. రివ్యూ కమిటీ సూచనల మేరకు మార్పులు చేయాల్సి వస్తే విడుదల తేదీపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే సినిమా సెప్టెంబర్ 4న అనుకున్న సమయానికే విడుదల అవుతుందా లేదా అనే దానిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

ఇక ‘రంభ ఊర్వశి మేనక’ను దర్శకుడు చంద్ర మోహన్ చింతాడ తెరకెక్కించారు. నిమ్మకాయల ప్రసాద్, రాజేష్ దండ సంయుక్తంగా నిర్మించారు. అల్లరి నరేష్‌కు జోడీగా సురభి నటించగా.. రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ వరుసగా రంభ, ఊర్వశి, మేనక పాత్రల్లో కనిపించనున్నారు. వెన్నెల కిషోర్, వి.కె. నరేష్, శ్రీనివాస రెడ్డి, మురళీధర్ గౌడ్, హరితేజ, షిజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. స్వర్గం, భూలోకం మధ్య చోటుచేసుకునే ఓ కాస్మిక్ మిస్టేక్ చుట్టూ ఈ సినిమా కథ సాగనున్నట్లు తెలుస్తోంది. రంభ, ఊర్వశి, మేనక భూలోకానికి రావడం, వారి దివ్య శక్తుల కారణంగా ఓ సాధారణ వ్యక్తి ఎదుర్కొనే పరిస్థితులను కామెడీ, ఫాంటసీ అంశాలతో తెరకెక్కించినట్లు సమాచారం. పల్లెటూరి హాస్యంతో పాటు పురాణ నేపథ్యాన్ని కూడా ఇందులో మేళవించారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఆగస్టు 24న విడుదలైన అక్కినేని నాగార్జున లాంచ్ చేశారు. ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు సెన్సార్ సమస్యలు పరిష్కరించి అనుకున్న తేదీకే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.