
Ranabaali Teaser: విజయ్ దేవరకొండ మరో విభిన్నమైన కథతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. టీజర్లో కనిపించిన విజువల్స్, విజయ్ లుక్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. చరిత్ర, యాక్షన్, డ్రామా అంశాల మేళవింపుతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ‘రణబాలి’ కథకు 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనలో చోటుచేసుకున్న కొన్ని వాస్తవ ఘటనలను ప్రేరణగా తీసుకున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఆ కాలంలో జరిగిన పరిణామాలను కల్పిత కథనంతో ముడిపెట్టి రాహుల్ సాంకృత్యాన్ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. దీంతో చరిత్రలోని ఆ ఘటనలను దర్శకుడు ఎలాంటి కోణంలో చూపించబోతున్నారనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇక సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. విజయ్, రష్మిక కాంబినేషన్‌కు తోడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్రలో ఉండటం సినిమాపై అంచనాలను పెంచుతోంది. ముఖ్యంగా టీజర్లో విజయ్ కనిపించిన తీరు అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచింది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 16న ‘రణబాలి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పలు భారతీయ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాను టీ-సిరీస్ సమర్పిస్తోంది. అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు. బ్రిటిష్ పాలన నాటి వాస్తవ ఘటనలకు రాహుల్ సాంకృత్యాన్ టేకింగ్, విజయ్ దేవరకొండ ఇమేజ్ తోడవడంతో ‘రణబాలి’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.














