Ravi Teja: హసిత్ గోలి ఏం ప్లాన్ చేస్తున్నావ్! మాస్ రాజా మూవీలో మాళవిక, ఐశ్వర్య..

RaviTeja

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఇరుముడి సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ అభిమానుల్లో జోష్‌ను నింపుతున్నారు. ఈ క్రమంలో ఆయన హీరోగా డైరెక్టర్ హసిత్ గోలి తెరకెక్కించనున్న కొత్త సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. రవితేజ, యువ హీరో శ్రీవిష్ణు కలిసి నటించనున్న ఈ మల్టీస్టారర్‌కు సంబంధించి తాజాగా ఆసక్తికరమైన అప్‌డేట్ సినీ వర్గాల్లో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను ఖరారు చేసినట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం.. టాలీవుడ్‌లో వరుస చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేశ్, మాళవిక మోహనన్ ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఐశ్వర్య రాజేశ్.. రవితేజకు జోడీగా కనిపించనుండగా.. మాళవిక మోహనన్ శ్రీవిష్ణుతో జతకట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఒకే సినిమాలో రెండు క్రేజీ జోడీలు ప్రేక్షకులను అలరించనున్నాయనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.

డైరెక్టర్ హసిత్ గోలి గతంలో ‘రాజా రాజా చోర’, ‘స్వాగ్’ వంటి చిత్రాలతో తనదైన మార్క్‌ను చూపించారు. ఇప్పుడు రవితేజ, శ్రీవిష్ణు వంటి ఇద్దరు హీరోలను ఒకే సినిమాలో చూపించబోతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరిగాయి. కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రాధాన్యతనిస్తూ ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. సినిమా పూర్తి నటీనటులు, ఇతర సాంకేతిక వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మొత్తంగా రవితేజ – శ్రీవిష్ణు మల్టీస్టారర్‌లో ఐశ్వర్య రాజేశ్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా కనిపించనున్నారనే వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా 2027 సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.