Sambaraala Yetigattu Glimpse: ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్‌తో సాయిదుర్గా తేజ్ ఊచకోత!

Sambaraala Yetigattu Glimpse

Sambaraala Yetigattu Glimpse: సంక్రాంతి బరి అంటేనే బాక్సాఫీస్ వద్ద పెద్ద హీరోల హోరాహోరీ పోరు. అలాంటి క్లిష్టమైన పండుగ సీజన్‌లో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, కంటెంట్‌పై తిరుగులేని ధీమాతో నేరుగా సమరానికి దిగుతున్నారు మెగా మేనల్లుడు సాయిదుర్గా తేజ్. నూతన దర్శకుడు రోహిత్ కేపీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ పీరియాడిక్ వార్ డ్రామా ‘సంబరాల ఏటిగట్టు’ (SYG). ‘హను-మాన్’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ‘అసుర ఆగమనం’ గ్లింప్స్ ఇంటర్నెట్‌లో పెను తుఫాను సృష్టిస్తోంది. గ్లింప్స్ స్టార్ట్ అయిన క్షణం నుంచే ఒక సరికొత్త ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించారు. ఈ గ్లింప్స్‌లో తేజ్ రగ్గడ్ అవతారంలో కనిపించి అందరినీ స్టన్ చేశారు. మునుపెన్నడూ చూడని ఊరమాస్ బాడీ లాంగ్వేజ్‌తో, చేతిలో రక్తసిక్తమైన కత్తిని గాల్లోకి లేపుతూ “అసుర సంధ్యవేళ మొదలైంది.. రాక్షసుల ఆగమనం!” అంటూ గంభీరమైన గొంతుతో తేజ్ ఇచ్చిన వార్నింగ్ ప్రతి ఒక్కరికీ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది.

విజువల్స్ ఒక ఎత్తయితే, ‘కాంతార’ ఫేమ్ బీజే అజనీష్ లోక్‌నాథ్ అందించిన భీకరమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ గ్లింప్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ నిర్మాణ విలువలు అత్యున్నత ప్రమాణాలతో దర్శనమిస్తున్నాయి. హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ దాదాపు పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచింది. త్వరలోనే పాటలను విడుదల చేయడానికి చిత్ర బృందం ప్రణాళికలు రచిస్తోంది. ఎంతమంది పోటీలో ఉన్నా లెక్కచేయకుండా వచ్చే ఏడాది జనవరి 12న ‘సంబరాల ఏటిగట్టు’ను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం మరోసారి స్పష్టం చేసింది. ఈ గ్లింప్స్ చూసిన సినీ విశ్లేషకులు, అభిమానులు సాయిదుర్గా తేజ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఖాయమని తేల్చి చెబుతున్నారు.