
Indian 3: లోకనాయకుడు కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన కల్ట్ క్లాసిక్ ‘భారతీయుడు’. మూడు దశాబ్దాల క్రితం లంచగొండితనంపై సేనాపతి చేసిన సమరం ఇండియన్ సినిమా చరిత్రలోనే నిలిచిపోయింది. అయితే, 2024లో ఎన్నో అంచనాల నడుమ వచ్చిన సీక్వెల్ ‘భారతీయుడు 2’ బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. ఆ చేదు ఫలితంతో ఇక మూడో భాగం అటకెక్కినట్లేనని, శంకర్ – కమల్ ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశారని సినీ వర్గాల్లో రెండేళ్లుగా జోరుగా ప్రచారం సాగింది. తాజాగా ఆ పుకార్లన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. అందరి అనుమానాలకు తెరదించుతూ ‘భారతీయుడు 3’ని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ‘భారతీయుడు 3: వార్ మోడ్’ (Indian 3: War Mode) ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
పోస్టర్‌లో సేనాపతి రూల్‌లో కమల్ హాసన్ మరో ఇద్దరితో కలిసి గుర్రపు స్వారీ చేస్తూ యుద్ధ రంగానికి దూసుకెళ్తున్న దృశ్యం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. దానికి తోడు “సేనాపతి పునరుత్థానం మొదలవబోతోంది.. ఈసారి ఎవ్వరినీ ఉపేక్షించడు” అంటూ ఇచ్చిన ట్యాగ్‌లైన్ సినిమాపై ఒక్కసారిగా హైప్‌ను పెంచేసింది. రెండో పార్ట్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా, పార్ట్-3లో అసలైన కంటెంట్‌తో తాము చెప్పాలనుకున్న యుద్ధాన్ని తెరపైకి తెచ్చేందుకు శంకర్ సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, ఎస్.జె. సూర్య వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే పూర్తి షెడ్యూల్ వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. రెండో భాగం నిరాశపరిచినా, ఈ ‘వార్ మోడ్’ పోస్టర్‌తో శంకర్-కమల్ కాంబో నుంచి రాబోయే విద్వంసం ఎలా ఉండబోతుందోనని సినీ అభిమానుల్లో సరికొత్త ఉత్కంఠ మొదలైంది.














