Veta: ‘కమిటీ కుర్రోళ్లు’ హీరో కొత్త ‘వేట’.. ఈసారి సాత్వికతో కలిసి బరిలోకి దిగుతున్న సందీప్ సరోజ్

Cinema

Veta: యంగ్ హీరో సందీప్ సరోజ్, సాత్విక జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ‘వేట’. ఈ చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఎస్ఆర్‌డీ ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మిస్తుండగా.. అశోక్ కోటిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కొణిదెల నాగబాబు, ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్, వీఎన్ ఆదిత్య, మెహర్ రమేష్, సాయి రాజేష్, ఎస్‌కేఎన్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి నాగబాబు స్క్రిప్ట్ అందించగా.. కేఎస్ రవికుమార్ క్లాప్ కొట్టారు. సాయి రాజేష్, ఎస్‌కేఎన్, వీఎన్ ఆదిత్య, ఫణి అడపాక కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో యదు వంశీ, అనుదీప్ దేవ్ తదితరులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో సందీప్ సరోజ్ మాట్లాడుతూ.. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యానని తెలిపారు. ‘వేట’ టైటిల్ చిరంజీవి గారి సినిమాకు సంబంధించినదే అయినప్పటికీ, తమ కథకు ఈ పేరు ఎంతో యాప్ట్‌గా ఉంటుందని చెప్పారు. తన కొత్త సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ.. దర్శకుడు అశోక్ కోటిపల్లి ఫోన్‌లో ‘వేట’ కథను వివరించారని, కథ తనకు ఎంతో నచ్చిందని తెలిపారు. ఈ చిత్రంలో గ్రామంలో పెద్ద మనిషి తరహా పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. డైరెక్టర్ అశోక్ కోటిపల్లి మాట్లాడుతూ.. ‘వేట’ తన తొలి సినిమా అని, కథ చెప్పగానే కేఎస్ రవికుమార్ అంగీకరించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తనకు అవకాశం కల్పించిన నిర్మాతలకు, ఈటీవీ విన్ టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

నిర్మాత ఫణి అడపాక మాట్లాడుతూ.. ఈటీవీ విన్‌తో కలిసి చేస్తున్న మూడో ప్రాజెక్ట్ ఇదేనని చెప్పారు. ‘కమిటీ కుర్రోళ్లు’ తరహాలో ‘వేట’ కూడా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న కథ అని తెలిపారు. దర్శకుడు అశోక్ చెప్పిన కథ తనకు బాగా నచ్చిందని, సహజత్వంతో పాటు కమర్షియల్ అంశాలు కలగలిసిన చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నామని వెల్లడించారు. హీరోయిన్ సాత్విక మాట్లాడుతూ.. ‘వేట’ తన కెరీర్‌కు మంచి ప్రారంభంగా నిలుస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో సందీప్ సరోజ్ హీరోగా, సాత్విక జంపా హీరోయిన్‌గా నటిస్తున్నారు. కేఎస్ రవికుమార్, రాజీవ్ కనకాల, రఘుబాబు, రవీంద్ర విజయ్, ప్రభావతీ, ప్రమోదిని, వికాస్ వశిష్ట తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా షూటింగ్, ఇతర వివరాలను చిత్రబృందం త్వరలో వెల్లడించనుంది.