
Tarun Bhascker: సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా విలక్షణమైన గుర్తింపు తెచ్చుకుని, నటుడిగానూ తనదైన ముద్ర వేస్తున్న తరుణ్ భాస్కర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ‘క్రేజీ కళ్యాణం’ చిత్ర ట్రైలర్ లాంచ్ వేదికగా ఆయన మాట్లాడిన మాటలు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా, పెద్ద చర్చకు దారితీశాయి. సినిమాలో తాను పోషించిన ‘బాలరాజు’ పాత్రను ఉద్దేశించి ఆయన బయటి ప్రపంచపు ద్వంద్వ నీతిపై వేసిన సెటైర్లు వేదికను హోరెత్తించాయి.
సమాజంలో మనుషుల ప్రవర్తనను, తన పాత్ర స్వభావాన్ని పోలుస్తూ తరుణ్ భాస్కర్ చేసిన వ్యాఖ్యలు సూటిగా గుచ్చుకునేలా ఉన్నాయి. “బయట సమాజంలో అందరూ స్వార్థంతో రకరకాల లెక్కలు వేసుకుంటున్నారు. ముఖం ముందర దోస్తుల్లా నటిస్తూనే, వెనుక వెన్నుపోట్లు పొడుస్తున్నారు. మొహాలు మార్చేస్తూ బావిలో కప్పల్లా బతికే మనుషులున్నారు. కానీ బాలరాజు అలా కాదు.. వాడు మ్యాథ్స్‌లో చాలా వీక్! వాడికి స్వార్థపు లెక్కలేవీ రావు. వాడికి తెలిసిన ఏకైక లెక్క 30, 60, 90 (మద్యం కొలతలు) మాత్రమే!” అంటూ పంచ్ విసిరారు. లోకంలో మోసాలు చేసే కపట మనుషుల కంటే, మనసులో ఏ కల్మషం లేని బాలరాజు లాంటి అమాయక తాగుబోతే ఎంతో ఉత్తముడని, వాడి లాంటి మంచోడు ఎవరూ ఉండరని తరుణ్ సమర్థించుకొచ్చారు.
తన పాత్రపై వస్తున్న కామెంట్స్, ట్రోల్స్ గురించి మాట్లాడుతూ.. “నన్ను కేమియో.. గెస్ట్ రోల్ అని ట్రోల్ చేస్తున్నారు. కానీ తెరపై బాలరాజుగా నేను కనిపించడానికి కారణం ఇక్కడున్న యూత్ మాత్రమే. వీళ్లని చూసే నేను ఆ క్యారెక్టర్‌లో జీవించాల్సి వచ్చింది. బాలరాజు ఒక అమాయకుడు. ఈ ప్రపంచం ఇచ్చే ప్రేమ చూస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుంది” అంటూ తనదైన హైదరాబాదీ యాసలో సరదాగా స్పందించారు. చివరగా అక్టోబర్ 16న థియేటర్లలో ‘బాలరాజు’ ఇచ్చే కిక్ సరికొత్తగా ఉంటుందని హామీ ఇచ్చారు.














