Dil Raju: ‘టాక్సిక్’తో దిల్ రాజుకు డబుల్ ధమాకా.. సినిమా హిట్ కాకపోయినా ప్రాఫిటేనా?

Dil Raju

Dil Raju: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్‌పై సోషల్ మీడియాలో ఆసక్తికర కథనాలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను దక్కించుకున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు ఈ సినిమాతో భారీ ప్రయోజనం కలిగేలా ఒప్పందాలు జరిగాయని ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వివరాల ప్రకారం.. ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ కోసం తొలుత సుమారు రూ.108 కోట్లకు కమిట్‌మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ మొత్తాన్ని రూ.80 కోట్లకు సవరించినట్లు సమాచారం. చివరకు కొనుగోలుదారుల నుంచి దాదాపు రూ.75 కోట్లు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఆంధ్రా నుంచి రూ.35 కోట్లు, సీడెడ్ నుంచి రూ.10 కోట్లు, తెలంగాణ నుంచి రూ.30 కోట్లు వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఈ డీల్‌లో మరో కీలక అంశం ఉందని తెలుస్తోంది. ‘టాక్సిక్’లో నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ వాటా సగానికి కూడా తక్కువగా ఉండగా.. మెజారిటీ వాటా హీరో యశ్‌దేనని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ సినిమా వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోతే, నిర్ణీత గడువులో లోటును భర్తీ చేసేలా యశ్ ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే దిల్ రాజుతో పాటు ఇతర డిస్ట్రిబ్యూటర్లు కూడా ధైర్యంగా బిజినెస్‌లోకి వచ్చినట్లు టాక్.

ఇక దిల్ రాజుకు మరో ప్రయోజనం కూడా ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది. భవిష్యత్‌లో తన బ్యానర్‌లో ఓ సినిమా చేసేందుకు యశ్ ఇప్పటికే కమిట్ అయినట్లు సమాచారం. ‘టాక్సిక్’ వల్ల ఏదైనా లోటు ఏర్పడితే.. ఆ మొత్తాన్ని యశ్‌తో చేయబోయే తదుపరి సినిమాకు అడ్వాన్స్‌గా పరిగణించే అవకాశం ఉందట. అంతేకాకుండా కేవీఎన్ ప్రొడక్షన్స్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమా నైజాం రైట్స్ కూడా దిల్ రాజుకు దక్కే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. టాక్సిక్ అంచనాలు అందుకోకపోయినా ఇతర ఒప్పందాల ద్వారా రిస్క్‌ను తగ్గించుకునేలా దిల్ రాజు డీల్ చేసుకున్నారని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.