
Toxic: స్టార్ హీరో యశ్ ప్రస్తుతం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ‘KGF’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా భారీ స్టార్‌డమ్ సంపాదించుకున్న యశ్‌కు ‘టాక్సిక్’ కీలక పరీక్షగా మారింది. ఈసారి ఆయనకు రాఖీ భాయ్ అనే ఐకానిక్ పాత్రగానీ, ఇప్పటికే ప్రేక్షకుల్లో ఏర్పడిన ఫ్రాంచైజ్ క్రేజ్‌గానీ ఈ సినిమా ద్వారా అందుబాటులో ఉండదు. దీంతో యశ్ తన సొంత స్టార్ పవర్‌ను ఈ సినిమా పరీక్షించనుంది. ‘టాక్సిక్’ భారీ స్థాయిలో విజయం సాధిస్తే.. ‘KGF’ బ్రాండ్‌కు అతీతంగా కూడా యశ్ తన సొంత క్రేజ్‌తో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అందించగలడని నిరూపించినట్టే అవుతుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదే కారణంగా సినిమాపై అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ ఆసక్తి నెలకొంది.
గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ కథ గోవా నేపథ్యంలో రూపొందినట్లు తెలుస్తోంది. అందమైన బీచ్‌ల వెనుక దాగి ఉన్న శక్తివంతమైన డ్రగ్ కార్టెల్ చుట్టూ కథ సాగుతుందని సమాచారం. అయితే ఇది కేవలం యాక్షన్ మూవీ మాత్రమే కాదని, తండ్రీకొడుకుల మధ్య సంఘర్షణ కూడా కథలో కీలక అంశంగా ఉంటుందని తెలుస్తోంది. డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ ఈ సినిమాను ‘పెద్దల కోసం తెరకెక్కించిన ఫెయిరీ టేల్’గా అభివర్ణించారు. ఈ చిత్రంలో యశ్ ‘రాయా’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్‌ను చూస్తే యష్ ఈ సినిమాలో తండ్రి, కొడుకు పాత్రల్లో డబుల్ రోల్‌లో కనిపించినన్నట్లు స్పష్టం అవుతుంది. ‘టాక్సిక్’లో యశ్ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా.. నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. యశ్ నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించడంతో పాటు రచనలోనూ భాగస్వామ్యం వహించారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 26న థియేటర్లలో విడుదల కానుంది. ‘టాక్సిక్’ భారీ విజయం సాధిస్తే యశ్ పాన్ ఇండియా మార్కెట్‌లో తన స్టార్ పవర్‌ను మరోసారి బలంగా చాటుకున్నట్టే అవుతుంది.














