
టర్కీ, గ్రీస్ దేశాలను నిన్న భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 7.0గా దీని తీవ్రత నమోదైంది. భూకంపం ధాటికి టర్కీలో స్వల్పంగా సునామీ వచ్చింది. రాకాసి అలలు తీర ప్రాంతాలను ముంచెత్తాయి. భూకంపం కారణంగా పలు భవనాలు నేలమట్టమయ్యాయి. జనం ప్రాణభయంతో పరుగులు తీశారు. భూకంపం కారణంగా టర్కీ, గ్రీస్ దేశాల్లో ఇప్పటి వరకు 14 మంది చనిపోయారు. 419 మంది గాయపడ్డారు.
భూకంపం ప్రభావం టర్కీలోని ఇజ్మీర్ పట్టణంపై తీవ్రంగా పడింది. అక్కడ పలు భవనాలు నేలకూలాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. విద్యుత్, సమాచార వ్యవస్థ దెబ్బతింది. శిథిల భవనాల కింద మరికొంతమంది చిక్కుకుని ఉండొచ్చని, కాబట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 70 మందిని రక్షించినట్టు చెప్పారు. గ్రీస్‌లోని సామోస్ ద్వీపానికి అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.









