
నిర్లక్ష్యం కారణంగానే కరోనా మరణాలు అని వైద్యులు చెబుతున్నారు.కేవలం హైదరాబద్ లోనే 20 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అయిదు వేల మంది వరకు ఉన్నారు. మిగిలిన వారు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వైరస్ అధికమై శరీరంలోని కొన్ని అవయవాలు స్పందించని స్థితిలో అనేకమంది పడకలపై కనిపిస్తున్నారు. దీనిపై వైద్యులు ఆరా తీస్తే చాలా మంది కరోనా లక్షణాలు ఉన్నా పరీక్ష చేయించుకోవడానికి ముందుకు రాకపోవడమే కారణమని తేలింది.
తమకు వచ్చింది సాధారణ జ్వరంగానే కొందరు భావించగా.. అధికంగా పని చేయడం వల్లనో, ఇతర కారణాల వల్లో వచ్చిందని మరికొందరు తమను తామే సమాధానపర్చుకున్నారు. దీంతో శరీరంలో వైరస్ ఉద్ధృతంగా మారి ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తోంది. ఒక్కసారిగా శ్వాస అందక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పరిస్థితి విషమంగా మారిన తరువాత ఆసుపత్రుల వైపు పరుగులు తీస్తున్నారు. గత నెల రోజుల్లో ఇలా చనిపోయిన రోగుల సంఖ్య అధికంగా ఉంది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలున్నప్పుడు తక్షణం పరీక్షలు చేయించుకుంటే ఇబ్బందే ఉండదని వైద్యులు చెబుతున్నారు









